ఏపీ, తెలంగాణ: శ్రీశైలం, సాగర్‌ గొడవలో ట్విస్ట్?

గతేడాది నవంబరు 29న అర్ధరాత్రి ఏపీ పోలీసులు, నీటి పారుదల అధికారులు సాగర్ ప్రధాన డ్యాంపైకి వచ్చి 13వ నంబరు గేటు వరకు ఏప పరిధిలోకి వస్తుంది అంటూ ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో ఏపీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో డ్యాంకు ఇరు వైపులా ఏపీ, తెలంగాణ పోలీలసు బలగాలు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో కేంద్ర జలశక్తి జోక్యం చేసుకుని గత డిసెంబరు 3న ప్రధాన డ్యాంపై ఏపీ, తెలంగాణ కు ఇరు వైపులా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేసింది. దీంతో సాగర్ డ్యాంను సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జనవరి 17న కేంద్ర జలశక్తి సమావేశం తర్వాత సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుంటునట్లు ప్రకటించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు. అప్పటి నుంచి నిబంధనలు మారాయంటూ సీఆర్పీఎఫ్ బలగాలు ఎన్ఎస్పీ సిబ్బంది, అధికారులను ఏపీ వైపు వెళ్లకుండా 13గేటు వద్ద నిలిపివేస్తున్నారు.

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై తెలంగాణ సర్కారు అడ్డం తిరిగింది. కేంద్ర జల్ శక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ నెల 17న దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కృష్టా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించిన తెలంగాణ నీటిపారుదల అధికారులు దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే ప్లేటు ఫిరాయించారు. ప్రాజెక్టుల అప్పగింతకు తాము అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు.  

తెలంగాణ భూభాగంలోని అవుట్ లెట్లను స్వాధీనం చేసుకుంటే.. తమ భూభాగంలోని అవుట్ లెట్లను అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  కానీ తెలంగాణ సర్కారు దీనికి విముఖత వ్యక్తం చేసింది.  తమ నిర్వహణలో ఉన్న సాగర్ ను ఏపీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని కేంద్రానికి తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. దీంతో జల వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: