షర్మిళ-జగన్: ఇక నేరుగా అన్నాచెల్లెళ్లు యుద్ధం?

ఏపీలో అసలు సిసలు రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటి వరకు జగన్ కు ప్రత్యర్థులుగా చంద్రబాబు, పవన్,  పురంధేశ్వరిలు ఉండగా ఇప్పుడు ఆ జాబితాలోకి వైఎస్ షర్మిళ వచ్చి చేరారు. కాంగ్రెస్ పార్టీ లో వైటీపీని విలీనం చేసిన తర్వాత ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సోదరుడు వైఎస్ జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు.

దీనిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిళకు ఇక్కడి అభివృద్ధి ఏం తెలుసని వ్యాఖ్యానించారు. దీనిపై మాట్లాడిన షర్మిళ వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపిస్తామని చెబుతున్నారు. మేం చూడటానికి సిద్ధంగా ఉన్నాం. టైం, డేట్, మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే రెడీ అంటూ బాలకృష్ణ డైలాగ్ తరహాలో ప్రతి సవాల్ విసిరారు. మీరు చేసిన ప్రగతి చూసేందుకు నాతో పాటు మీడియా, మేధావులు, ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా వస్తారు అంటూ వార్తల్లో నిలిచారు.

షర్మిళ జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నుంచి తన యాత్రను ప్రారంభించారు. పలాస నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కి ఇచ్చాపురం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను జగన్ రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చడం లేదంట. ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే సంబోధిస్తా.  నాకేం అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చారు.

కాకపోతే మీరు చేసిన అభివృద్ధి ఎక్కడో చెప్పండి అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.   రాజధాని ఎక్కడ? పోలవరం ప్రాజెక్టు ఎక్కడ? మీ అభివృద్ధి ఆంధ్రా మొత్తం చూడాలను కుంటుంది అని మీ సవాల్ ను స్వీకరిస్తున్నా అని షర్మిళ అన్నారు.  అయితే అభివృద్ధి గ్రామాల్లోకి వెళ్తే కనిపిస్తోందని కొంతమంది కౌంటర్లు ఇస్తున్నారు.  ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ఆసుపత్రి, వాలంటీర్ వ్యవస్థ ఇలా  చాలా ఉన్నాయని గతానికి నేటికి ఉన్న తేడా గమనించాలని పలువురు షర్మిళకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: