చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌?

ప్రస్తుత రాజకీయాల్లో ఒక పార్టీకి అభ్యర్థులు, కార్యకర్తలు, ఓటర్లు ఎంత ముఖ్యమో వ్యూహకర్తలు కూడా అంతే ముఖ్యం .  గెలుపోటముల్లో వీరి పాత్ర ఎంత అనే విషయానికి పరిమితులు లేకపోయినా ప్రజా నాడిని వీరు పసిగట్టగలరు. ప్రజాస్వామ్యాన్ని శాసించగలరు అనే స్థాయిలో వీరి హవా ప్రస్తుతం కొనసాగుతుంది.

అయితే ప్రశాంత్ కిశోర్ గురించి తెలియని వారుండరు. ఐప్యాక్ సంస్థ ద్వారా 2019లో ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పీకే రాజకీయ వ్యూహాలు విజయవంతం అయ్యాయి. ఆ పార్టీ ఏకంగా 151 సీట్లలో బంపర్ మోజార్టీతో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ కు దూరం అయ్యారు. రాజకీయ వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఐప్యాక్ లో పనిచేసిన కొందరు వైసీపీ కోసం పనిచేస్తూనే ఉన్నారు.

అయితే ఇటీవల ప్రశాంత్ కిశోర్ చంద్రబాబుతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.  లోకేశ్ తో పాటు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిశోర్ నేరుగా చంద్రబాబుతో గంటల తరబడి చర్చలు జరిపారు.  దీంతో టీడీపీ కోసం పీకే పనిచేస్తారనే ప్రచారం నడిచింది. అయితే పూర్తి సమయం కేటాయించేందుకు కాదని.. ఎన్నికల వరకు కీలకమైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించారనే టాక్ నడిచింది.

అయితే ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ టీం పని చేస్తోంది. రాబిన్ పూర్వాశ్రమంలో ఐప్యాక్ టీం సభ్యుడే. ప్రశాంత్ కిశోర్ సమకాలీకుడు. గత నాలుగేళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తున్నాడు.  సరిగ్గా ఇటువంటి సమయంలో చంద్రబాబు పీకేను పిలిపించుకున్నారు. కానీ కలిసి పనిచేస్తున్నాం అని ప్రకటన మాత్రం చేయలేదు.  తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో పీకే స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు టీడీపీ తరఫున రాజకీయ వ్యూహకర్తగా పనిచేయాలని కోరారని కానీ దానిని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. తాను ప్రస్తుతం బిహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నానని కావాలంటే సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పానన్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ఒత్తిడి మేరకు చంద్రబాబును కలిశానని.. అంతకుమించి మరేమీ లేదని కుండబద్దలు కొట్టారు. ఇది ఓ విధంగా చంద్రబాబుకి నష్టం చేకూరిస్తుందని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: