జాతీయ మీడియాకు అడ్డగోలుగా ఏపీ సొమ్ము?

ప్రాంతీయ మీడియాను పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీలు జాతీయ మీడియాకు సాగిల పడుతుంటాయి. అవి నిర్వహించే సదస్సులకు స్పాన్సర్స్ చేస్తుంటాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోను ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి మీడియా యాజమాన్యాలు సదస్సులు నిర్వహిస్తే ప్రభుత్వ పరంగా స్పాన్సర్స్ చేశారు. ప్రత్యేకంగా జీవోలు విడుదల చేసి మరీ వారికి సహకరించారు. అయితే చంద్రబాబు సహకరించినంత మాత్రాన మీడియా యాజమాన్యాలు చంద్రబాబు గెలుస్తారని అని చెప్పలేదు. పైగా చంద్రబాబుతో పాటు ఇతర విపక్ష నేతలను కూడా ఆ సమావేశానికి పిలిచాయి.

చంద్రబాబు పాలన, వైఫల్యాలు సాధించిన విజయాలు, ఇతర సమస్యలపై అప్పట్లో రాజ్దీప్ సర్దేశాయ్ చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేశారు.  ఇదే తరహాలో జగన్ మోహన్ రెడ్డి, ఇతర విపక్ష నేతలను ఇంటర్వ్యూలు చేశారు. అయితే అప్పట్లో ఏపీలో ప్రభుత్వం మారుతుందని ఇండియా టుడే నుంచి మొదలు పెడితే టైమ్స్ ఆఫ్ ఇండియా వరకు చెప్పింది. చెప్పినట్లుగానే అక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చింది.

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే ఫలితాన్ని విడుదల చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ భారీగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. దీంతో ఎల్ల్లో మీడియా తెగ గింజుకుంటుంది.  టైమ్స్ ఆఫ్ ఇండియాకు జగన్ రూ.7 కోట్లు ఇచ్చారని ప్రచారం చేస్తోంది.

ఇప్పుడు తాజాగా ఇండియా టుడే కాన్ క్లేవ్ పేరుతో తిరుపతిలో రెండు రోజుల పాటు సదస్సులు నిర్వహించనుంది. దీనికయ్యే ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వం భరించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇందులో సీఎం జగన్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఎల్లో మీడియా మాత్రం జగన్ అడ్డగోలుగా డబ్బులు ఇవ్వడం వల్లే జాతీయ మీడియా ఆయనకు అనుకూలంగా వార్తలు రాస్తోందని విమర్శించడం మొదలు పెట్టింది.  ఒకవేళ ఇండియా టుడే కూడా జగన్ కు అనుకూలంగా సర్వే తీర్పు ఇస్తే ఎలాంటి ప్రచారం చేస్తుందో చూడాలి మరి. మరోవైపు దీనికి చంద్రబాబు కూడా హాజరవుతారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: