కేటీఆర్.. మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారా?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిద్దామనుకున్న బీఆర్ఎస్ ఆశలు నెరవేరలేదు. ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఏదోలా చేసి అధికారం నిలబెట్టుకుంటుందని చాలామంది భావించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మినహా మిగతా చోట్ల ఆ పార్టీని ఓటర్లు తిరస్కరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.

వీరి ఓటమికి ప్రధాన కారణం నిరుద్యోగులే అని చెప్పవచ్చు. వీరి తర్వాత ఉద్యోగులు, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వంటి కారణాలు బీఆర్ఎస్ గెలుపును అడ్డుకున్నాయి. ఇక మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలోని 17 సీట్లలో డబుల్ డిజిట్ సీట్లను సాధించి అన్ని పార్టీల కన్నా ముందుండాలని మూడు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు సమీక్షా సమావేశాలు, సమన్వయ, సమాయత్త సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో తమ బలాబలాలపై అంచనాలు వేసుకుంటున్నాయి. గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు అభ్యర్థుల వేటలో ఉన్నాయి.

అయితే లోక్ సభ ఎన్నికలను బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. 10-12 సీట్లు గెలిచేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చకపోవడంతో గట్టి ఎదురు దెబ్బ తిన్న గులాబీ నేతలు ఈ సారి లోక్ సభకు దాదాపు పది స్థానాల్లో అభ్యర్థలను మార్చనున్నట్లు
తెలుస్తోంది.

సిట్టింగ్ స్థానాల్లో ఖమ్మం, చేవేళ్ల, జహీరాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల అభ్యర్థులను మార్చుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేస్తున్నారనే విషయాన్ని కేటీఆర్ మరిచిపోతున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు స్పష్టమైన మోజార్టీ ఇచ్చిన ప్రజలు లోక్ సభ కు వచ్చే సరికి బీజేపీ, కాంగ్రెస్ కు సమ ప్రాధాన్యం ఇచ్చారు.  , కేంద్రంలో మరోసారి మోదీ వస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ప్రజలు అధికార కాంగ్రెస్ ను కాదని.. బీఆర్ఎస్ ను ఆదరిస్తారా లేదా అంటే వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: