కేసీఆర్‌ను ఓడించిన లోపం.. జగన్‌ అధిగమిస్తారా?

మరికొద్ది నెలల్లో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ, టీడీపీ, జనసేనలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరికి వారు గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. ఎప్పుడు లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు తమ హయాంలోనే అందుతున్నాయని.. అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెబుతోంది.



ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వారి ఇళ్ల వద్దకే చేర్చామని అందుకే అధికారం కట్టబెడతారు అని నమ్మకంతో వైసీపీ ఉంది. జగన్ మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయి.. ఈ పథకాలను చూసి వైసీపీకి ఓట్లువేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.



అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని వైసీపీ నాయకులు మర్చిపోతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అక్కడ సిట్టింగ్ అభ్యర్థులను మార్చకపోవడం. దీంతో పాటు మరొకటి కూడా ఉంది. ద్వితీయ శ్రేణి, స్థానిక నాయకులు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇది కూడా పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది. ఇదే పరిస్థితులు ఏపీలోను ఉంటాయా అని పలువురు చర్చించుకుంటున్నారు.



వాస్తవానికి తెలంగాణలో సర్పంచి దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరూ బీఆర్ఎస్ నాయకులే. దీనివల్ల ప్రతి పనిలో అవినీతి పెరిగిపోయింది. దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి ఇలా కొన్ని పథకాల్లో పైరవీలు నడిచాయి. ఏపీ లో నేరుగా లబ్ధిదారుని ఖాతాకే నగదు జమ అవుతోంది. నేరుగా ఓటరుకు , జగన్ కు సత్సంబంధాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీరు ఉండటం వల్ల ధ్రువీకరణ పత్రాల కోసం గ్రామ సచివాలయాల దగ్గర నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో స్థానిక నాయకుల ప్రమేయం అవసరం లేకుండా పోయింది. దీంతో వారు అసంతృప్తిగానే ఉన్నా పార్టీ కోసం పనిచేయాల్సిన పరిస్థితి. ఓటరుతో జగన్ పర్సనల్ కెమిస్ర్టీ వైసీపీకి సానుకూల అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: