బాబు మెడికల్ రిపోర్టు వివాదం.. ముగిసినట్టేనా?
ఇప్పుడు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వివాదం సద్దుమణిగింది. కానీ అప్పట్లో వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అది నిజమైన మెడికల్ రిపోర్టు కాదని టీడీపీ కార్యాలయంలో తయారు చేసిందని.. బెయిల్ కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఆరోపించింది. దీంతో ఇది కాస్తా ఇరుపార్టీల వివాదంగా మారింది.
అయితే దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు బెయిల్ విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పొడగించుకునేందుకు చంద్రబాబు న్యాయవాదులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో వైపు ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు చంద్రబాబు నివేదికపై సంచలన ఆరోపణలే చేశారు.
కోర్టుకు సంబంధించిన చంద్రబాబు మెడికల్ రిపోర్టు చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. అవే అనారోగ్య సమస్యలు ఉంటే కంటికి శస్త్ర చికిత్స చేయడం అసాధ్యమని.. ఆ సాహసం చేయడానికి ఏ వైద్యులు కూడా ముందుకు రారని తేల్చేశారు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఆయన్ను విమర్శిస్తున్నారు. సీదిరి అప్పలరాజు పశువుల శాఖా మంత్రిగా అభివర్ణిస్తున్నారు. ఆయన వెటర్నరీ డాక్టర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే సీదిరి స్వతాహాగా డాక్టర్. గుండె సంబంధిత వైద్య నిపుణుడు కూడా. ఆయనకు వైసీపీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. స్వతహాగా వైద్యుడు కాబట్టే దీనిపై సమగ్రంగా వివరించగలిగారు. ఆయన లేవనెత్తిన అంశాలు చూస్తుంటే చంద్రబాబు మెడికల్ రిపోర్టు తప్పేమో అనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు పలికినట్టే.