మోడీ.. ఈడీని అలా ఆయుధంగా వాడుతున్నారా?

కణికుడు మహా భారతంలో ఒక పాత్ర. ఇతడు శకుని మంత్రి. దుర్యోధనుని యువరాజు చేయాలని ధృతరాష్ట్రుడు ఎంత ప్రయత్నించినా అలా జరగలేదు. దీంతో రాజనీతి బాగా తెలిసిన కణికుని పిలిపించుకొని సలహాలు అడుగుతాడు ధృతరాష్ట్రుడు. సామదానభేద దండోపాయాలతో శత్రువులను ఎలా మట్టు బెట్టాలో ఆయన ఈ సందర్భంగా చెబుతారు. కణికుడు చెప్పిన  ఆ  రాజనీతి నేటి మన ప్రజాస్వామ్య రాజకీయాల్లో సైతం అమలవుతోంది.

అధికారం ఎలా సంపాదించాలి.. దానిని ఎలా నిలుపుకోవాలి.. అందు కోసం శత్రు నిర్మూలన ఏయే రూపాల్లో ఎలా చేయాలో చెబుతాడు. తాజాగా ఆ సూత్రాలను ప్రస్తుత రాజకీయాలకు అన్వయించి చూస్తే పాలకులు తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సమస్త వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుస్తోంది.  ఉదాహరణకు ఈడీ, సీబీఐ, ఐటీ తదితర దర్యాప్తు సంస్థలు.  వీటిని అడ్డు పెట్టుకొని  కేంద్రం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. తద్వారా రాజకీయ లబ్ధి పొందుతోంది అని వారు ఆరోపిస్తున్నారు.

ఇది నిజమే అయినా.. గతంలో ఉన్న దర్యాప్తు సంస్థలనే ఆయన కొనసాగించారు తప్ప కొత్తవాటిని ఆయనేమి సృష్టించలేదు. ఎన్నికల అప్పుడే డబ్బులు తీస్తారు కాబట్టి ఆ సమయంలో దాడులు చేస్తేనే దొరుకుతారు.  కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో వీటిని వేరే క్రమంలో వినియోగించుకుంది. ఆయా పార్టీలను బెదిరించి వారిని తమవైపు తిప్పుకునేది. ప్రధాని మోదీ సర్కారు వచ్చిన తర్వాత అధికార పక్షంపై 5శాతం దాడులు జరిగితే.. ప్రతిపక్షాలపై 95శాతం దాడులు జరిగాయి.

అయితే అధికారులే అధికార పార్టీ అని వారిని వదిలేస్తున్నారో..లేక మరే ఇతర కారణమో తెలియదు.  కానీ రికవరీల పరంగా చూసుకుంటే 2004-14 యూపీఏ హయాంలో రూ. 4,156 కోట్లను ఈడీ జప్తు చేసింది.  ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీయే కూటమి హయాంలో 2014-23 వరకు చూసుకుంటే  ఆ మొత్తం రూ.1,21,355 కోట్లు.  దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: