సొంత పెళ్లామైనా.. అలా శృంగారం చేస్తే నేరమే?

మత నిబంధనలు ఏవైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలని మరోసారి కోర్టులు తేల్చి చెప్పాయి. పెళ్లి పేరు చెప్పి పిల్లలతో ఎవరు లైంగిక సంబంధాలు పెట్టుకున్నా అది నేరమే అని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. ముస్లిం వివాహాలను పోక్సో చట్టం నుంచి మినహాయించలేమని కేరళ  హైకోర్టు చెప్పేసింది. పదిహేనేళ్ల బాలికను పెళ్లి చేసుకుని ఆమెతో శృంగారం చేసి.. నా భార్యే కదా అని అంటే అది చెల్లదని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. అలా ఓ బాలిక గర్భం దాల్చడానికి కారకుడయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 31 ఏళ్ల వ్యక్తికి  కేరళ హైకోర్టు బెయిల్‌ను నిరాకరించింది.

ఆ బాలికను తాను పెళ్లి చేసుకున్నానని సదరు వ్యక్తి చెప్పినా ఆ అభ్యర్థనను కేరళ హైకోర్టులోని  జస్టిస్‌ బెచు కురియన్‌ థామస్‌ తోసిపుచ్చారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఖలేదూర్‌ రెహమాన్‌ అనే వ్యక్తి కేరళకు చెందిన ఓ మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ బాలిక గర్భం దాల్చింది.  ఆమె ఇంజెక్షన్‌ తీసుకోవడానికి కేరళలోని పథనంథిట్ట జిల్లాలోని ఓ ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన సమయంలో ఈ విషయం బయటపడింది.

అక్కడి వైద్యులకు అనుమానం వచ్చింది. అప్పుడు అక్కడి వైద్యాధికారి బాలిక ఆధార్‌ కార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఆధార్ కార్డు ప్రకారం ఆ బాలిక వయసు 16 సంవత్సరాలే ఉంది. దీంతో ఆ వైద్యాధికారి ఈ  విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేసిన  పోలీసులు ఖలేదూర్‌ రెహమాన్‌పై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అయితే..  తాను ముస్లిం చట్టం ప్రకారమే ఆ బాలికను 2021, మార్చి14న వివాహం చేసుకున్నానని సదరు వ్యక్తి చెబుతున్నాడు.

ముస్లిం చట్టం ప్రకారం ఈ వివాహం చెల్లుతుందని వాదించాడు. అందువల్ల తనకు పోక్సో చట్టం వర్తించదంటూ కోరుతూ ఖలేదూర్‌ కేరళ హైకోర్టులో వాదించాడు. ఈ మేరకు తనకు బెయిల్‌ ఇవ్వాలని  పిటిషన్‌ దాఖలు చేశాడు. దీన్ని విచారించిన కేరళ హైకోర్టు పిల్లలతో లైంగిక సంబంధాలు నెరపడాన్ని పోక్సో చట్టం అనుమతించబోదని తేల్చి చెప్పింది. బాలికను పెళ్లి చేసుకున్నా లైంగికంగా వేధించడాన్ని నేరం కిందే పరిగణించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: