చంద్రబాబు పిలుపు.. జనం స్పందిస్తే మంచిదే?

ఇటీవల ఏపీలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం చంద్రబాబు.. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వo, వైఫల్యo ప్రదర్శించిందని విమర్శించారు. 2014తో తన ప్రయత్నం కారణంగా ఏపీలో చేరిన పోలవరం విలీన గ్రామాలు... ఇప్పుడు జగన్ నిర్లక్ష్యంతో మళ్లీ తెలంగాణలో కలపాలనే డిమాండ్ చేస్తున్నాయని టీడీపీ బాస్ మండిపడిన సంగతి తెలిసిందే. వరద కష్టాలను దగ్గరుండి పరిశీలించిన చంద్రబాబు.. ఇప్పుడు వారిని ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రజలకు, పార్టీలకు పిలుపు ఇస్తున్నారు.

వరద బాధితులకు కూరగాయలు, బియ్యం, ఎండుగడ్డి వితరణ చేయవలసిందిగా దాతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయన్న అయన దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో వున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.  వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. మానవత్వాన్ని మరచిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ముంపు గ్రామాల్లో మేత లేక పశువులు నకనకలాడుతున్నాయని..  కూరగాయలు, బియ్యం లేక ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో వున్నారని చంద్రబాబు తెలిపారు. ఇళ్లలో బురద చేరిపోయిందని... ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంటిలో వున్న అన్ని వస్తువులు పనికిరాకుండా పోయిన దృశ్యాలు తన పర్యటనలో చూశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచిందన్న చంద్రబాబు అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వరద బాధితులన్ని స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదుకోవాలని చంద్రబాబు  పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ కొంత మేరకు సాయం అందించింది, సాయం కొనసాగిస్తున్నదని చంద్రబాబు గుర్తు చేశారు. దాతలు వారి పేరుతోగానీ, టీడీపీ ద్వారా గాని ఎండుగడ్డి వితరణ చేయవలసిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కూరగాయలు, బియ్యం కూడా అందించవలసిందిగా దాతలను చంద్రబాబు కోరారు.  చంద్రబాబు పిలుపుకు దాతలు స్పందిస్తే.. బాధితులకు సాయం అందుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: