
జగన్.. మీరు ఈ రంగాన్ని ఆదుకోవాలి.. తప్పదు..!
విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధర అధికం కావడం, రొయ్యల ధర తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించాలని ఆక్వా రైతులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రకటనలు చేశారు. అయితే.. ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదు. ఫీడ్ కేజీకి రూ.20, మినరల్స్, ఇతర మందుల ధరలు 30 శాతం పెరిగినా సీఎం దృష్టికి సమస్య రాలేదా అన్న వాదన వినిపిస్తోంది. అలాగే రొయ్యల రేటు మాత్రం ఏ కౌంటు అయినా కేజీ సుమారు 70 నుంచి 150 వరకూ తగ్గినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శ కూడా వినిపిస్తోంది.
ఆక్వారంగానికి మేలు చేస్తానని జగన్ గతంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తెచ్చిన ఫీడ్-సీడ్ యాక్ట్ లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న విమర్శ కూడా ఉంది. ప్రతిపక్షనేతగా జగన్ పాదయాత్రలో ఆక్వా రైతులకి యూనిట్ విద్యుత్ ను రూ. 1.50 పైసలకే ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే.. అధికారంలోకొచ్చాక 0.50 పైసలు తగ్గించి, మళ్లీ రూ. 2.36 పైసలు పెంచి దారుణంగా మోసగించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి సబ్సిడీలు ఎత్తివేయడం ఆక్వారైతులకు ద్రోహం చేయడమేనంటున్నారు. విమర్శలు ఎలా ఉన్నారా.. ఇప్పటికైనా ఆక్వా రైతుల డిమాండ్ల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఆక్వా హాలీడే నుంచి తప్పించాలి. ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా విద్యుత్ యూనిట్‌కి రూ. 1.50నే కొనసాగించాలి. క్వాలిటీ సీడ్ సరఫరా చేయాలి.