ఈ అతి అమరావతి రైతుల కొంప ముంచుతుందా?

అమరావతి రైతులు కొన్ని సమయాల్లో అతిగా ప్రవర్తిస్తుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి పదవీ విరమణ సందర్భంగా రాజధాని రైతులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికిన తీరు కూడా అలాంటిదే అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిపై చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులలో సత్యనారాయణ మూర్తి కూడా ఒకరు. అందుకే ఆయన పదవి విరమణ సందర్భంగా రైతులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. హైకోర్టు నుంచి రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రహదారి వరకు ఆయన వచ్చే దారిలో పూలబాట పరిచారు.

అంతే కాదు.. జస్టిస్ సత్యనారాయణ మూర్తి  వచ్చే సమయంలో చేతులు జోడించి  నమస్కారాలు పెట్టారు. మెడలో ఆకుపచ్చ కండువాలు చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని జై అమరావతి అంటూ నినాదాలు కూడా చేశారు. న్యాయ స్థానమే దేవస్థానం.. న్యాయమూర్తులు మా దేవుళ్లు అంటూ  జస్టిస్ సత్యనారాయణ మూర్తి పూలవర్షం కురిపించారు. ఇలా చేయడం వల్లే.. ఈ జడ్జిలు, అమరావతిని సపోర్ట్ చేసే టీడీపీ కుమ్మక్కవుతున్నారంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. గతంలోనూ ఒకరిద్దరు న్యాయ మూర్తులు రిటైర్ సమయంలోనూ ఇలాగే అమరావతి రైతులు వ్యవహారించారు.

న్యాయమూర్తులు తమ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో తీర్పులు ఇస్తుంటారు. కానీ ఎప్పుడూ ఇలాంటి గౌరవాలు, సన్మానాలు, సత్కారాలు జరగవు.. అలాంటి వాటికి సాధారణంగా జడ్జిలు దూరంగానే ఉంటారు. కానీ ఇప్పుడు ఇలా అమరావతి రైతులు ప్రత్యేకంగా ట్రీట్ చేయడం వల్ల న్యాయమూర్తుల తీర్పులపై కూడా భాష్యాలు చెప్పుకునే అవకాశం కల్పించినట్టు అవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మార్చి 3వ తేదిన తీర్పు ఇచ్చింది. ఆ ధర్మాసనంలో ఈ జస్టిస్ సత్యనారాయణ మూర్తి కూడా ఒకరు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ సయమంలో ఇలా ఘనంగా వీడ్కోలు పలకడం దాన్ని టీడీపీ అనుకూల మీడియాలో హైలెట్ చేయడం కూడా విపరీత అర్థాలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: