ఈ ఒక్క సమస్యతో జగన్ పరువు మొత్తం గోవిందా?
ఇంతగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. ఇప్పుడు వచ్చిన విద్యుత్ కొరత సమస్యతో అంతా మట్టి గొట్టుకుని పోయేలా ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌ను విద్యుత్ కొరత సమస్య వేధిస్తోంది. అసలే వేసవి.. దీనికి తోడు బొగ్గు కొరత సమస్య ఉంది. కొందామన్నా ఎక్కడా విద్యుత్ లేదని.. అందుకే విద్యుత్ కోతలు అని ప్రభుత్వం వివరణ ఇస్తున్నా దాన్ని గురించి ఎవరు పట్టించుకుంటారు. విద్యుత్ అనేది నిత్యావసరంగా మారిన ఈ రోజుల్లో విద్యుత్ కోతలు అంటే.. అది పరిపాలనకు ఏమాత్రం మంచి పేరు తెచ్చి పెట్టదు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో.. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరంట్ సమస్య వస్తుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భయపెట్టారు. అందుకే రాష్ట్రం విడిపోగానే కేసీఆర్ విద్యుత్ సమస్యపై దృష్టి సారించారు. అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కరంట్ సమస్య రాకుండా జాగ్రత్త పడ్డారు. అటు చంద్రబాబు కూడా తన హయాంలో కరంట్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ.. ఇన్నాళ్లకు మళ్లీ ఏపీలో కరంట్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి వచింది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అది జగన్ సర్కారు పని తీరుపై చెడు ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా కరంట్ సమస్య ఉంటే.. జనం అవన్నీ మరచిపోయి.. అబ్బే.. ఈ జగన్ వేస్ట్ అండీ అని కామెంట్ చేస్తారు. జగన్ ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది.