శభాష్‌ పవన్: చాలా మంచి పని చేస్తున్నావ్‌?

పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ అధినేత.. ఆయన పార్టీ స్థాపించి ఇప్పటికి 8 ఏళ్లు దాటిపోయింది.కానీ ఇప్పటి వరకూ ఆయన పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచిందే లేదు. ఏదో మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా జనసేనలో లేడు. పోనీ.. అలాగని పవన్ కల్యాణ్‌ మరీ అంత తీసేసే నాయకుడా అంటే అదీ కాదు.. జనాకర్షణ, జనాలకు మంచి చేయాలనే కోరిక ఉన్న నాయకుడే. రాజకీయాల్లో కొనసాగే స్థిరత్వం లేకపోవడం..కొన్ని వ్యూహాత్మక లోపాలు ఆయన రాజకీయ కేరీర్‌ను ఇబ్బంది పెడుతున్నాయి..


అయినా సరే. పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా అలాంటి నిర్ణయం కౌలు రైతుల విషయంలో తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున జనసేన ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఇందుకు తనవంతు గా రూ.5 కోట్లు సాయం అందించారు. మనకు అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం ఆవేదన కలిగించిందని పవన్ కల్యాణ్ అంటుంటారు.


అందు కోసమే కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు  పవన్ కల్యాణ్‌ తాజాగా మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో వివరించారు. ఈనెల 12న అనంతపురం జిల్లా నుంచి పవన్ కల్యాణ్... జనసేన రైతు భరోసా యాత్ర ప్రారంభించబోతున్నారు. నిజంగా ఇది మంచి నిర్ణయం.. నిజంగానే కౌలు రైతుల కష్టాలు చెప్పనలవి కాదు.. ఎందుకంటే.. సాధారణంగా రైతు ఏదైనా ప్రకృతి విపత్తువల్లో.. మరేదైనా కారణంతోనో పంట కోల్పోతే.. అతన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది.


కానీ.. కౌలు రైతు సంగతి అలా కాదు.. కౌలు రైతు రికార్డుల్లో ఉండడు..కానీ ఏపీలో కౌలు రైతులే ఎక్కువ. వారికి ఎలాంటి సాయం అందదు.. పంట చేతికి రాకపోతే.. ఇక రైతులు ఆత్మహత్యే శరణ్యం అన్నట్టుగా ఉంటుంది వారి పరిస్థితి.. ఇలాంటి వారి సమస్యను పవన్ కల్యాణ్ టేకప్ చేయడం ఆహ్వానించతగ్గ పరిణామం.. మరి పవన్ కల్యాణ్ టేకప్ చేశాకైనా జగన్ సర్కారు ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: