రేవంత్, కోమటి రెడ్డి భేటీలో అదిరిపోయే ట్విస్ట్...!
ఉప్పు నిప్పుగా ఉండే రేవంత్, కోమటి రెడ్డి మధ్య ఇటీవల జరిగిన భేటీ అందరిలో ఆసక్తి నెలకొల్పింది. రేవంత్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఆయనతో భేటీకి సుముఖత వ్యక్తం చేయని కోమటి రెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ను ఆత్మీయంగా ఆళింగనం చేసుకున్నారు. వీరిద్దరూ గంటల తరబడి పార్టీ విషయాలు మాట్లాడుకున్నారు. అయితే వారిద్దరి మధ్య చర్చకు వచ్చిన విషయాలే సంచలనంగా మారాయి. అయితే వీరి మధ్య చర్చకు వచ్చిన విషయాలు లీక్ కావడంతో ఒక వర్గం ఆనందంగా.. మరొక వర్గం ఆందోళనగా ఉంది.
ఈ ఇద్దరి భేటీలో మొదటగా పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందట. పాదయాత్రనా లేదా బైక్ లేదా బస్సు యాత్ర ఏదైతే బాగుంటుందో అనే అంశంపై చర్చించారట. తర్వాత కోమటి రెడ్డి బహిరంగ సభ పెట్టాలని భావించారట. జనగామ లేదా భువనగిరిలో ఒక చోట సభ పెట్టి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారట. అలాగే తనను ఏఐసీసీ కార్యదర్శి పదవికి సిఫార్సు చేయాలని రేవంత్ ను కోరారట కోమటి రెడ్డి.
తర్వాత కోమటి రెడ్డి వర్గం వచ్చే అసెంబ్లీ టికెట్లపై హామీ అడిగిందట. కనీసం 20 నుంచి 30 స్థానాలు తన అనుచరులకు ఇవ్వాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారట. వరంగల్, నల్లొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని స్థానాలను తన వర్గానికి ఇవ్వాలని అడిగారట. ఇందులో తొలుత నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ స్థానాలపై చర్చ జరిగిందట. వీటికి రేవంత్ ఓకే చెప్పారట.
ఆ తర్వాత తుంగతుర్తి, సూర్యాపేట కూడా తన వారికే అడిగారట కోమటి రెడ్డి. ఈయన మద్దతుదారైన రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఈ రెండు స్థానాలు కావాలని పట్టుబడుతున్నారట. అయితే రేవంత్ ఈ రెండు స్థానాలపై అభ్యంతరం తెలిపారట. తుంగతుర్తి అద్దంకి దయాకర్, సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తానని చెప్పారట. దామోదర్ రెడ్డిని ఖమ్మం జిల్లా పాలేరులో పని చేసుకోవాలని సూచించారట. అయినా ఈ స్థానాలపై చర్చలు కొలిక్కి రాలేదట.
అలాగే.. జడ్చర్ల టికెట్ ను కోమటి రెడ్డి సన్నిహితుడు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రేవంత్ సన్నిహితుడు మాజీ ఎంపీ మల్లు రవి పనిచేసుకుంటున్నారు. సామాజిక కోణంలో కూడా ఆలోచిస్తే ఎర్ర శేఖర్ ని పార్టీలో చేర్చుకొని జడ్చర్ల టికెట్ ఇవ్వాలని రేవంత్ భావించారట. అయితే కోమటి రెడ్డి మాత్రం ఈ స్థానం కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు. మల్లు రవికి కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని.. ఎర్ర శేఖర్ వస్తే ఆయనకు మహబూబ్ నగర్ స్థానం కేటాయించాలని కోమటి రెడ్డి సూచించారట. ఈ భేటీ విశేషాలు ఎలా ఉన్నా ఇద్దరు నేతల ముఖ్య అనుచరులు కూడా పాల్గొనడంతో శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చినట్లు అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. చూడాలి మరి వీరి సయోధ్య ఎంత వరకు వెళుతుందో..!