జడ్జిమెంట్‌ : ఇవాళ 3 రాజధానులపై కీలక తీర్పు..?

ఏపీ చరిత్రలో ఇవాళ ఓ కీలకమైన రోజుగా మిగలబోతోంది. ఎందుకంటే.. ఇవాళ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఈ పిటిషన్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ అంశంలో ఇరుపక్షాల వాదనలు ఇప్పటికే విన్న ధర్మాసనం ఇవాళ తీర్పు చెబుతుంది. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ రెండు బిల్లులు వెనక్కి తీసుకున్నందున ఇక విచారణ అక్కర్లేదని ప్రభుత్వ లాయర్లు వాదించారు.

అయితే.. రైతులతో పాటు మరికొందరు పిటిషనర్లు మాత్రం విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలంటూ వాదించారు. దీంతో ఇవాళ ఏం తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠ ఏపీ వాసుల్లో నెలకొంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించిన అమరావతిని కాదని జగన్ సర్కారు కొత్తగా మూడు రాజధానుల బిల్లు తెచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే జగన్ సర్కారు ఈ మూడు రాజధానుల ఆలోచన చేసింది. అమరావతిని రాజధానిగా కొనసాగించడం ఇష్టం లేని జగన్.. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు.

అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తూ.. విశాఖకు కార్య నిర్వాహక రాజధానిగా చేస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దీని ప్రకారం.. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది. మూడు ప్రాంతాలకూ న్యాయం జరుగుతుందని వైసీపీ చెబుతూ వచ్చింది. అయితే.. ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావడంలో జగన్ సర్కారు పూర్తిగా తడబడింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీకి మండలిలో మెజారిటీ లేదు. అయినా బిల్లు పాస్ చేసుకునేందుకు ఆ పార్టీ ఇబ్బంది పడింది.

ఈ నేపథ్యంలో ఈ అంశం హైకోర్టుకు చేరింది. హైకోర్టు మూడు రాజధానుల నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. అలా రాజధానిగా విశాఖను చేయాలన్న నిర్ణయం వాయిదా పడింది. ఇప్పుడు వైసీపీకి మండలిలోనూ మెజారిటీ ఉన్న దృష్ట్యా.. ఈ బిల్లులను రద్దు చేసుకుని.. మళ్లీ ఇబ్బందులు లేని కొత్త బిల్లు తెచ్చే ఆలోచనలో ఉంది. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అమరావతి పై హైకోర్టు నిర్ణయం ఏమని వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: