యుద్ధం: రష్యా తప్పుదోవ పట్టిస్తోందా.. అసలేం జరుగుతోంది?

ఉక్రెయిన్ - రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని నిన్నా మొన్నా వార్తలు వచ్చాయి. దీంతో ప్రపంచం ఊపిరిపీల్చుకుంది. హమ్మయ్య యుద్ధం తప్పినట్టే అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే అది ఉక్రెయిన్ రష్యాకే పరిమితం కాదు.. ఒక్కొక్కటిగా అనేక దేశాలు ఆ యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది చినికి చినికి గాలివానగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్న భయాందోళనలు కూడా కలిగాయి. అందుకే మూడు రోజుల క్రితం స్టాక్ మార్కెట్‌ ఒకే రోజు 1700 పాయింట్ల వరకూ పడిపోయింది.

అయితే.. ఇప్పుడు అమెరికా మరో బాంబు పేలుస్తోంది. యుద్ధం ముప్పు తొలగిపోలేదని.. రష్యా మరో రెండ్రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ మరోసారి బాంబు పేల్చారు. ఈ విషయం అమెరికా గట్టిగా బయటకు చెప్పడంతో ఆగ్రహించిన రష్యా అమెరికా సీనియర్ దౌత్యాధికారిని దేశం నుంచి బహిష్కరించింది. అయినా సరే.. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సిద్ధంగా ఉందనే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా దాడి చేస్తుందనడానికి తమకు చాలా సంకేతాలు అందాయని బైడెన్‌ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఎందుకంటే.. సరిహద్దు నుంచి రష్యా సైన్యాన్ని వెనక్కి తరలించలేదని బైడెన్‌ గుర్తు చేస్తున్నారు. రష్యా ఇతర దేశాలను తప్పుదోవ పట్టిస్తోందని బైడెన్‌ ఆక్షేపిస్తున్నారు. సరిహద్దుల వద్ద రష్యా అదనపు బలగాలు మోహరిస్తోందని నాటో వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి ఇంతకీ అసలు వాస్తవం ఏంటి.. యుద్ధం ముప్పు ఉందా.. లేదా.. అన్నది మిగిలిన దేశాలకు అర్థం కాకుండా ఉంది. అమెరికా పదే పదే యుద్ధం తప్పదని ప్రచారం చేయడం వెనుక కూడా మరేదైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు కూడా కొన్ని దేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

రష్యాపై యుద్ధ కాంక్ష ఉన్న దేశంగా ముద్ర వేయడం ద్వారా మిగిలిన ప్రపంచ దేశాల్లో తమ ప్రాబల్యం పెంచుకుందామని అమెరికా యత్నస్తోందన్న ప్రచారమూ ఉంది. ఏదేమైనా యుద్ధం మాత్రం రాకూడదు.. యుద్ధం అంటూ వస్తే అన్నీ అనర్థాలే.. గ్యాస్ ధరలు, చమురు ధరలు పెరుగుతాయి. ప్రపంచం మరోసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: