బాబు చెవిలో తమ్ముళ్ల మాట: ఈ హామీ ఇచ్చేద్దాం.. గెలుపు మనదే..!
చంద్రబాబు లేదా.. లోకేష్‌బాబు.. ఇద్దరిలో ఎవరో ఒకరు.. ప్రజాక్షేత్రంలో పర్యటించనున్నారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే.. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి? వారిని తమవైపు ఎలా మలుపు తిప్పుకోవాలి? గత పథకాలను తిరిగి అమలు చేస్తామంటే.. ప్రజలు ఓటేస్తారా? ఒకవేళ వేస్తారని అనుకున్నా.. జగన్‌కు దిమ్మ తిరిగేలా షాకివ్వాలంటే.. ఆ తరహా కరెంట్ సరిపోదు కదా! ఏం చేయాలి? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో అంతర్మథనం.
గతంలో జగన్ .. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ.. రోడ్డు మీదకు వచ్చారు. మరి ఇప్పుడు ఇంత రేంజ్‌లో చంద్రబాబుకూడా రావాలి. అదేస్థాయిలో హామీలు కూడా గుప్పించాలి. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా టీడీపీ మేదోమధన బృందం.. కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. ప్రజలకు ఇచ్చే హామీలపై నేతలు దృష్టి పెట్టారు. అయితే.. వారికి సంచలన ఆలోచలను ఏవీ తట్టడం లేదు. దీంతో సాధారణ హామీలే ఇచ్చేందుకు రెడీ అవుతు న్నట్టు పార్టీలో కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది.
అయితే.. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ నాయకులకు ఓ అద్భుతమైన ఐడియా తట్టింది. అదేంటంటే.. తాజాగా చంద్రబాబు ఒక సుదీర్ఘ ప్రసంగం చేశారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను ఆయన ఏకరువు పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, ముఖ్యంగా ఏపీ ఏర్పడిన తర్వాత.. వచ్చిన ప్రభుత్వాలు.. 3.14 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశాయని చెప్పారు.
కానీ, జగన్ మాత్రం ఈ రెండు సంవత్సరాల 9 నెలలకాలంలో ఏకంగా దీనిని 7 లక్షల కోట్లకు పెంచారని చెప్పారు. దీనిని రాష్ట్రంలోని జనాభాపై పంచితే.. ప్రతి ఒక్క తలకు 4 నుంచి 5 లక్షల రూపాయల చొప్పున తేలుతుందని.. వీరంతా ఆ అప్పులు కట్టాల్సిందేనని.. తప్పించుకునేందుకు వీలు కాదని.. చంద్రబాబు సెలవిచ్చారు. దీంతో తమ్ముళ్లకు అద్భుతమైన ఐడియా వచ్చేసింది.
ఇంకేముంది.. ఇతర పథకాలు.. హామీల కోసం ప్రయాస పడే బదులు.. ఈ మొత్తం 7 లక్షల కోట్ల అప్పును మనం అధికారంలోకి రాగానే.. ఒంటిచేత్తో తీర్చేద్దాం.. ఇదే హామీ ప్రజలకు కూడా ఇచ్చేద్దాం.. అంటూ.. గుసగుసలాడుతున్నారు. అంటే.. ఒక్కొక్కరికి ఎంత లేదన్నా.. 4 లక్షల రూపాయల వరకు టీడీపీ లబ్ధి చూపించనట్టే కదా! ఇంతకన్నా గొప్ప రిలీఫ్ జనాలకు ఇంకేం ఉంటుందని.. వారు అంటున్నారు. మరి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.