తీసిన సైకిళ్లు.. షెడ్డుకు త‌ర‌లించేశారు బాబూ..!

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన ప్ర‌సంగంలో కొన్ని కొన్ని కామెంట్లు రికార్డు అవుతున్నాయి. వీటిని పార్టీ నేత‌లు బాగా ఒంట బ‌ట్టించుకుంటున్నారు కూడా. తాజాగా ఏపీ స‌ర్కారుపై విరుచుకుప‌డిన చంద్ర‌బాబు.. ఏపీలో ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు విసుగు పుట్టింద‌ని అన్నారు. స‌రే! ఇదేదో.. కామ‌నే క‌దా.. అనుకున్నారు అందరూ. అయితే.. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఒక‌దాని కొక‌టి విడ‌మ‌రిచి మ‌రీ.. చెప్పుకొచ్చారు. మేధావులు.. ఉద్యోగులు.. కూలీలు.. స‌న్న‌, చిన్న కారు రైతులు కూడా ఏపీ ప్ర‌భుత్వం పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నార‌ని తెలిపారు. ఇవి ఏవ‌ర్గంలోకి బాగా వెళ్లాయో తెలియ‌దు కానీ.. టీడీపీ నేత‌ల చెవుల్లోకి మాత్రం బాగానే ఎక్కాయి.

``ప్ర‌భుత్వంపై మ‌నం చెప్ప‌కుండానే.. ఎలాంటి ప్ర‌చారం చేయ‌కుండానే.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చేసింది. సో.. మ‌న‌కు ఆటోమేటిక్ గా ప్ర‌జ‌లు మొగ్గు చూపుతారు!`` అని నాయ‌కులు గుస‌గుస లాడుతున్నారు. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఏం చెబు తున్నారు. మీరు ప్ర‌జ‌ల్లో ఉండండి. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేయండి. వారికి ఈ స‌ర్కారు చేస్తున్న అన్యాయాల‌ను వివ‌రించండి. ప్ర‌భుత్వంలోని డొల్ల త‌నాన్ని తెర‌మీదికి తీసుకువ‌చ్చి ప్ర‌ద‌ర్శించండి. ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌జ‌ల్లోనే ఉండండి. అని పిలుపు నిస్తున్నారు. అయితే.. బాబు చెప్పిన‌ట్టు కొంద‌రు వింటున్నారు కొంద‌రు విన‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు మాత్రం నెత్తీ నోరూ కొట్టు కుంటున్నారు.

దీంతో ఇక‌, ఎన్నిక‌లు కూడా వ‌స్తున్నందున త‌ప్ప‌దురా.. దేవుడా! అంటూ.. నాయ‌కులు ఇప్పుడిప్పుడే.. సైకిల్ చ‌క్రాల‌కు గాలి కొడుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడే ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని.. ప్ర‌తి ప‌నికీ డ‌బ్బులు కావాల‌ని.. తాత్సారం చేస్తున్న నాయ‌కులు కొందరు ఉన్నారు. మ‌రికొంద‌రు.. తమ త‌మ వ్యాప‌కాలు, వ్యాపారాల్లో ఉన్న‌వారు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు పోరు ప‌డ‌లేక‌.. క‌దులుతున్న వారు క‌నిపిస్తున్నారు. కానీ, ఇంత‌లోనే చంద్ర‌బాబు చేసిన సుదీర్ఘ ప్ర‌సంగం.. నాయ‌కుల‌పై బ్రహ్మాస్త్రంగా ప‌నిచేసింది. అదేంటంటే.. జ‌గ‌న్ స‌ర్కారుపై.. ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌న్న చంద్ర‌బాబు.. దీనిని మ‌రింత విడ‌మ‌రిచి చెప్పారు.

కూలి ప‌నులు లేవ‌ని కార్మికుల‌కు, స‌రైన గిట్టుబాటు ధ‌ర‌లు లేవ‌ని.. రైతుల‌కు, ఉద్యోగాలు లేవ‌ని నిరుద్యోగులు, జీతాలు స‌రిగా లేవ‌ని.. ఉద్యోగులు, ఉపాధి ల‌బించ‌డం లేద‌ని.. ఇత‌ర వ‌ర్గాలు ఇలా.. అన్ని వ‌ర్గాలు కూడా.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెంచేసు కున్నాయ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఈ కోణాన్ని బాగా అర్ధం చేసుకున్న త‌మ్ముళ్లు.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఇంత వ్య‌తిరేక‌త వ‌చ్చేశాక‌.. మ‌నం క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లి ప్ర‌త్యేకంగా వ్య‌తిరేకత గురించి క్లాస్ పీక‌డం ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌లు చాలా విజ్ఞుల‌ని.. ఎలానూ చంద్ర‌బాబు చెప్పారు క‌నుక‌.. మ‌నం ప్ర‌త్యేకంగా జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త పెంచాల్సిన అవ‌స‌రం లేద‌ని.. నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. దీంతో తీసిన సైకిల్ ను కాస్తా.. మ‌ళ్లీ షెడ్డుకు త‌ర‌లించేశారు. ఇదీ.. సంగతి!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: