రఘురామ జనం మనిషా.. జగన్ మనిషా... నెటిజన్ల టాక్ ఇదే...!
తను నిజంగానే జనం మనిషి అయితే.. ఇన్నాళ్లు ఇన్ని విమర్శలు ఎదుర్కొని కూడా ఇంకా వైసీపీ పంచనే ఎందుకు ఉంటారు? ఆ పార్టీలోనే ఉంటూ.. ఇంకా.. ఆ పార్టీ అభ్యర్థిగానే పార్లమెంటు నుంచి జీతం తీసుకుం టూ.. ఎందుకు కొనసాగుతారు? ఏనాడో.. రాజీనామా విసిరి పడేసి.. జనంలోకి వెళ్లి ఉండేవారు కదా! అనేది నెటిజన్ల ప్రశ్న. దీనికి కూడా ఒక రీజన్ చెబుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనకు టికెట్ ఇవ్వక పోవడంతో ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దె రామ్మోహన్ వెంటనే టీడీపీ నుంచి బయటకు వచ్చి.. ఒంటరిగానే బరిలో నిలిచారు.
గెలుపు గుర్రం ఎక్కారు. అంతేతప్ప.. ఎక్కడా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయడం.. తాత్సారం చేయడం చేయలేదు. ఒక్క గద్దె మాత్రమే కాదు.. ఎంతోమంది నాయకులు ఒంటరిగా బరిలో నిలిచి గెలుపు గుర్రం ఎక్కిన వారు ఉన్నారు. మరి ఈ మాత్రం సత్తా ఉండి ఉంటే. రఘురామ కూడా ఎప్పుడో రాజీనామా చేసి.. జనం బాట పట్టి ఉండేవారని.. కానీ, ఇలా చేసేవారు కారని చెబుతున్నారు. ఆయన జగన్ మనిషిగానే గత ఎన్నికల్లో బరిలో నిలిచారని.. జగన్ మనిషిగానే ఆయన ప్రజలకు చేరువ అయ్యారని.. అలానే గెలిచారని.. అంటున్నారు.
మరోవాదన ఏంటంటే.. ప్రస్తుతం రఘురామకు రాజీనామా చేసే యోచన లేదని.. కేవలం ఇదంతా ఒక వర్గం మీడియా దృష్టిలో హైప్ పెంచుకునేందుకు ఆయన అలా చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే.. రాజీనామా చేస్తున్నాను.. అని ప్రకటించిన తర్వాత..ఆయన ఫస్ట్ పేజీలకు ఎక్కారు. ఇక, తర్వాత.. వాయిదా వేయడం ప్రారంభించారు. ఇది ఆయన అప్పటికప్పుడు హైప్ పెంచినా.. ప్రజల్లో ఆయన చులకన అవుతున్నారని.. నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక, క్షత్రియ సామాజిక వర్గంలోనూ.. విరుద్ధమైన వాదన వినిపిస్తోంది.
మన జాతి పరువు తీస్తున్నాడనే వ్యాఖ్యలు పశ్చిమగోదావరిలోనే వినిపిస్తున్నాయి. క్షత్రియ పౌరుషం అంటే.. మనుటయా.. మరణించుటయా? అన్నట్టుగానే ఉంటుందని.. కానీ, ఇలా వానపాము ప్రగల్భాలు పలకరని.. అంటున్నారు. అంతేకాదు.. గతంలో క్షత్రియులు రఘురామ ఏం మాట్లాడినా.. వినేందుకు ఆసక్తి చూపించేవారు.. కానీ, ఇప్పుడు ఆయన మీడియా టమీటింగులు పెడుతుంటే.. టీవీల ఛానెళ్లను తిప్పేస్తున్నారని పశ్చిమ టాక్. సో.. దీనిని బట్టి.. రఘురామ జనం మనిషి కాదనే బలంగా వినిపిస్తుండడం గమనార్హం.