కేసీఆర్‌: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారుగా..?

అవును.. నిజమే.. కేసీఆర్‌ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకున్నారు.. ఉద్యోగుల బదిలీ సమస్యలపై మొన్న బండి సంజయ్‌ జాగరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. దాని కోసం కరీంనగర్‌లోని ఓ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. అయితే బండి సంజయ్ దీక్ష చేస్తే.. ఆయనకు ఎక్కడ మైలేజ్‌ వస్తుందో అన్న కారణంతో ఆయన దీక్షకు అనుమతి ఇవ్వలేదు.. అదేమంటే కొవిడ్ సాకు చూపించారు. సరే.. అని ఆయన తన ఎంపీ కార్యాలయంలో దీక్షకు కూర్చున్నారు. అక్కడైతే కొవిడ్ సాకు సాగదుకదా అనుకున్నారు.

అలా బండి సంజయ్‌ను దీక్ష చేయనిస్తే ఓ పనైపోయేది. బండి సంజయ్‌కు ఒక రోజు మీడియా కవరేజ్ వస్తే మహా గొప్ప అన్నట్టు ఉండేది.. అయితే.. ఎందుకో కేసీఆర్ పంతానికి పోయారు. బండి సంజయ్ దీక్ష జరగడానికి వీళ్లేదన్నట్టున్నారు. ఇంకేముంది పోలీసులు.. తలుపులు పగలగొట్టి మరీ బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. సాధారణంగా ఇలాంటి దీక్షల సమయంలో అరెస్టు చేస్తే.. గంటల్లోనే ఆ నాయకుడిని వదిలేస్తారు. ఇది సాధారణమే. అందులోనూ బండి సంజయ్ ఎంపీ కూడా.

కానీ.. అలా చేస్తే తెలంగాణ పోలీసులు ఎందుకు అవుతారు. వివిధ రకాల సెక్షన్లు పెట్టి బండి సంజయ్‌కు బెయిల్ రాకుండా చేశారు. దీంతో బండి సంజయ్‌ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సో.. ఇప్పుడు బండి సంజయ్‌ మరో 14 రోజులు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అంశాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా కూడా స్పందించారు. కేసీఆర్ సర్కారుకు వినాశకాలే విపరీతబుద్ధి పుట్టిందని మండిపడ్డారు. బండి సంజయ్‌ తరపున పోరాడతామన్నారు.

ఇక ఇప్పుడు బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ 14రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. రేపు జిల్లా‌, మండల  కేంద్రాల్లో నల్ల‌ బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించింది. బండి సంయజ్‌ జైల్లో ఉన్న 14రోజుల పాటు.. వివిధ రకాలుగా నిరసన తెలిపి రచ్చ రచ్చ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పుడు మరో 14 రోజుల పాటు బండి సంజయ్‌కు అద్భుతమైన మైలేజీ రాబోతుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: