విశాఖ నుంచి రాహుల్ గాంధీ పోటీ..?
అయితే విభజన హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ మరింత అన్యాయంగా వ్యవహరిస్తుండటంతో ఏపీ ప్రజలు ఆ పార్టీపైనా తీవ్ర ఆగ్రహంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి కొంతలో కొంత ఊరట. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీని విశాఖకు రప్పించి ఇక్కడ నుంచి పోటీ చేయించడం ద్వారా ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని కాంగ్రెస్ అధిష్ఠానం తెలియజేసినట్టవుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా తాము కేంద్రంలోకి అధికారానికి వచ్చాక పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని భావి ప్రధానిగా రాహుల్ స్వయంగా భరోసా ఇవ్వడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి అందించినట్టవుతుందని కూడా కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు. గతంలో ఇందిరాగాంధీ రాజకీయంగా కష్టకాలంలో ఉన్నసమయంలో ఉమ్మడి ఏపీలోని మెదక్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారని, ఆ తర్వాత మళ్లీ ప్రధానిగా గెలిచి పునర్వైభవం సాధించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ సంస్థ ఉద్యోగులు, అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ వస్తే ఆయన వెంట నిలుస్తారని, ఇక కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు తిరిగి రావడం ద్వారా ఆయన గెలవడం కూడా తథ్యమని వారంటున్నారు. గత ఎన్నికల్లో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా కంచుకోటగా ఉన్న అమేధీ నుంచి మరోసారి పోటీ చేసిన రాహుల్ తొలిసారిగా ఓటమి రుచి చూసిన విషయం తెలిసిందే. అయితే కేరళ లోని వైనాడు నుంచి గెలిచి ఆయన లోక్ సభలో అడుగుపెట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతారేమో చూడాలి.