జగన్‌..ఎందుకు ఈ "రహస్య" పాలన..?

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. రాజరికంలో లేం.. రాజరికంలో రాజు ఏం చేసినా చెల్లుతుంది. కానీ.. ప్రజాస్వామ్యంలో అలా కాదు.. నవ ప్రజాస్వామ్యానికి పారదర్శకత శోభనిస్తుంది.  ప్రభుత్వం అంటే ప్రజల తరపున ట్రస్టీ అని గాంధీ చెప్పేవారు. అయితే.. ప్రభుత్వంలో ఉన్నవారు మాత్రం తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్టు వ్యవహరిస్తుంటారు. అలాంటి వారి కోసమే గతంలో ఎన్నో పోరాటల తర్వాత సమాచార హక్కు చట్టాన్ని సాధించుకున్నాం. ఈ చట్టం ప్రకారం ఏ సమాచారం అయినా ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే.

అంటే.. ప్రభుత్వంలో ఏదీ దాపరికంగా ఉండాల్సిన అవసరం లేదు. అదేమైనా దేశ భద్రత, ప్రజల రక్షణకు సంబంధించిన రహస్యమైన విషయం అయితే తప్ప ఏదీ దాచాల్సిన అవసరం లేదు. కానీ.. ఇటీవల ప్రభుత్వాలు రహస్య జీవోలంటూ కొన్ని జీవోలను విడుదల చేస్తున్నాయి. వాటిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం లేదు. ప్రత్యేకించి ఏపీలో ఈ సంస్కృతి బాగా పెరిగిపోయింది. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇలా కొన్ని రహస్య జీవోలు వచ్చేవి.. అప్పట్లో వైసీపీ దాన్ని ప్రశ్నించింది. అయితే ఇప్పుడు జగన్ సర్కారు అంతకు మించి అన్నట్టు వ్యవహరిస్తోంది.

అనేక రహస్య జీవోలు విడుదల చేస్తోంది. ఆ జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్‌ లోనూ ఉంచడం లేదు.   ఇటీవల దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీంతో  జీవోఐఆర్‌టీ వెబ్‌సైట్‌లో జీవోలను ఎందుకు పెట్టడం లేదని జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహించింది కూడా. గతంలో  జీవోలను ఈ-గెజిట్‌లో ఉంచుతామని ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే.. ఈ-గెజిట్‌లో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో జీవోలు ఉంచడం లేదు. మొత్తం జీవోల్లో కేవలం 4 నుంచి 5 శాతమే ఈ గెజిట్‌లో ఉంచుతోంది. ఈ అంశంపై కొందరు కోర్టుకు వెళ్లారు.

అయితే.. అతి రహస్య జీవోలు మాత్రమే అప్‌లోడ్ చేయట్లేదని జగన్ సర్కారు సమర్థించుకుంటున్నా.. అసలు జీవోలు రహస్యం, అతి రహస్యమని ఎలా నిర్ణయిస్తారని కోర్టే నిలదీసింది. అయినా అసలు జీవోలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వస్తోంది.. పారదర్శకంగా పరిపాలించలేకపోతున్నారా.. అన్న ప్రశ్నలకు జగన్ సర్కారు సమాధానం చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: