దండంతో సరిపెడతారా ! ?


 ఇది మీకు తెలిసిన విషయమే... కాకుంటే మరోక్కసారి గుర్తు చేస్తున్నాం..ఈ వారం కూడా  రైతే హాట్ టాపిక్. ఎందుకంటే. నేడు (డిసెంబర్ 23వ తేదీ)  జాతీయ రైతుల దినోత్సవం. రైతుల దినోత్సవానికి ఒక రోజు ముందే పార్లమెంట్ సమావేశాలను అనుకున్న సమయానికి ముందే ముగించేశారు పాలకులు.  ఈ శీతాకాల సమావేశాలు ఈ రోజు కనుక నడిచి ఉంటే... పాలకులకు రైతులు మరలా  ఒక దఫా గుర్తుకు వచ్చే వారు. అవును ఇది నిజం. రైతు నాయుకుడు చౌదరి చరణ్ సింగ్ ను ఉభయ సభలు తలచుకునేవి, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఆయన చిత్ర పటానికి నేతలు, పార్లమెంట్ సభ్యులు పూలమాలలు వేసి, అంజలి ఘటించేవారు. ఆ తరువాత యధావిధి...ఆయన్ని మరచి పోవడం.
అసలు రైతులకు ఏం కావాలి ? వారి అవసరాలు ఏంటి ?, వారి ఆలోచనలు ఏంటి ? వారి బతుకులు మరింత మెరుగు పడేదెలా ? అన్నఅంశాలపై  పాలకులు ఎవరూ ఆలోచనలు చేయడం లేదు. రాజధాని నగరాల్లోనో,  మెట్రోపాలిటన్ సిటీల్లో నూ, అక్కడి ఏసీ గదుల్లోనో కూర్చున్న పెద్దలు రైతుల గురించి చర్చలు జరుపుతుంటారు. కానీ అడుసులో దిగి వారి ఒంటి కి అందిన బురదని,  మండుటెండల్లో మాడుతున్న వారి బతుకుల గురించి వారి క్షైత్ర స్థాయి ఆలోచనలు చేయడం లేదన్నది  ప్రతినోటా వినిపిస్తున్న మాట.
భారత దేశం స్వాతంత్య్ర అమృత ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ  కూడా రైతులు కష్టాలుపడుతుండటం శోచనీయం.  గత నెల వరకూ దేశరాజధానిలో రైతులు  నెలల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. పోరాడితే పోయేది ఏమీ లేదంటూ వణికే చలిలో నిరసనలు తెలిపారు. ఎట్టకేలకూ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది ఈ శీతాకాల సమావేశాల్లో రైతు చట్టాలను  వెనక్కి తీసుకుంది. దీంతో రైతులు కొంత శాంతించి ఇంటి బాట పట్టారు.ఆంధ్ర ప్రదేశ్ లోనూ అమరావతి రైతులు  తాము చేసిన  న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్రను ముగించి ఇంటికి చేరుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి రైతులు చేసిన ఉద్యమం, దాని తీరుతెన్నులు ఒకసారి పరిశీలించి చూస్తే... సామాన్య రైతుల అవసరాలను ఆ ఉద్యమం ఏ దశలోనూ, ఎక్కడ కూడా ప్రస్తావించ లేదు.


పాలకులకు, నేతలకు అందరికీ,.. మీడియా ఇందుకు మినహాయింపు కాదండోయ్ డిసెంబర్ 23 వచ్చీందంటే రైతులు గుర్తుకు వస్తారు. చౌదరి చరణ్ సింగ్ గుర్తుకు వస్తారు.  ఆందరూ రైతు నాయుకుడికి ఓ దండం పెట్టి సరిపెడతారు.ఇది ఏటా క్రమం తప్పకుండా జరిగే తంతు మాత్రమే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: