సైన్యానికి సవాల్‌: కాశ్మీర్‌లో కొత్త కలకలం..?

భారత సైన్యం అజేయమైందని ఖ్యాతి ఉంది. అయితే మన సైన్యం సహనాన్ని పరీక్షిస్తూ అటు చైనా, ఇటు పాకిస్తాన్ పక్కలో బల్లేళ్లా తయారయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు.. బయటి శత్రువును ఎలాగైనా తుదముట్టించవచ్చు.. కానీ.. సొంత భూమిలో ఉండి కుట్రలు పన్నే వారి సంగతే మరీ ఇబ్బందికరం.  ప్రత్యేకించి కాశ్మీర్‌లో ఈ దుస్థితి ఎక్కువ. ఇటీవల కాశ్మీర్‌లో సైన్యానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకువస్తున్నాయి. ఇది సైన్యాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.


గతంలో కాశ్మీర్‌లో ఏ టెర్రరిస్టు ఘటన జరిగినా దాని వెనుక హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌, లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి సంస్థల మద్దతు కనిపించేది.. ఈ సంస్థల పేర్లే వినిపించేవి. కానీ.. ఇప్పుడు సీన్ మారింది.. గత రెండేళ్లలో కాశ్మీర్ ప్రాంతంలో నాలుగు కొత్త ఉగ్రసంస్థలు బాగా వినిపిస్తున్నాయి. వీటిని భద్రతాదళాలు గుర్తించాయి. అయితే కొత్తగా వచ్చే ఉగ్రసంస్థలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అవి మతపరమైన పేర్లు పెట్టుకోవడం లేదు. కొత్తగా సెక్యులర్‌ పేర్లను తమ సంస్థలకు పెట్టుకుంటున్నాయి. జైషే మహమ్మద్ సంస్థ నుంచి విడిపోయిన ఓ గ్రూపు ఇప్పుడు కశ్మీరీ టైగర్స్‌ పేరుతో కొత్త కుంపటి పెట్టుకుంది.


ఈ కాశ్మీర్‌ టైగర్లే కాదు.. మరికొన్ని కొత్త తీవ్రవాద సంస్థలు కూడా ఇలా మతానికి సంబంధించిన పేర్లు కాకుండా కొత్త పేర్లు పెట్టుకుంటున్నాయి. రెండు, మూడు రోజుల క్రితం కాశ్మీర్‌లో పోలీసుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో ఈ కాశ్మీరీ టైగర్స్‌ సంస్థ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ  దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో  11 మంది గాయపడ్డారు. కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగింపు తర్వాత పోలీసులపై జరిగిన పెద్ద దాడి ఇదేనని భద్రతాదళాలు చెబుతున్నాయి.


2019 తర్వాత కాశ్మీర్‌లో కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రసంస్థల్లో ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌, పీపుల్స్‌ అగైనెస్ట్‌ ఫాసిస్ట్‌ ఫోర్స్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ లాంటి సంస్థలు ఉన్నాయి. ఇలా ఉగ్ర సంస్థలకు కొత్త పేర్లు పెట్టడం వెనుక పాక్ హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పాత సంస్థల పేర్లుతో దాడులు జరిగితే దాని వెనుక పాక్ ఉందని భారత్ ఆరోపిస్తూనే ఉంటుంది. ఇలా కొత్త సంస్థలు అయితే.. తనకు సంబంధం లేదని బుకాయించడం పాకిస్తాన్‌కు సులభం అవుతుంది. ఈ కొత్త ఉగ్రసంస్థల ఆటకట్టించడమే ఇప్పుడు భద్రతాదళాల ముందున్న సవాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: