టాటాల సొంతం అయ్యేనా ?


టాటాల సొంతం అయ్యేనా ?
అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఎయిర్ ఇండియాను  టాటాలు గట్టెక్కిస్తారు ? ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో ఉన్న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపి అత్యధికంగా బిడ్ దాఖలు చేసింది టాటాలు. వీరికే  ఎయిర్ ఇండియా సొంతం అవుతుందే అందరూ ఊహించారు. అయితే ఇక్కడ చిన్న మెలిక ఉంది. ఎయిర్ ఇండియాతో పాటు, నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను  ప్రైవేటు పరం చేయటానికి ఉద్దేశించిన   మంత్రుల కమిటీ  ఒకటి ఉంది. ఆ కమిటీ దే  తుది నిర్ణయం. ఈ కమిటీ లో భారతీయ జనతా పార్టీ వ్యూహకర్త, కేంద్ర హోం మంత్రి అమిత్ షా  సదరు కమిటీలో సభ్యుడిగా ఉన్నారు .ఇదే కమటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, తో పాటు ఇటీవలే మంత్రి వర్గంలో చేరిన విమాన యాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా సభ్యులుగా ఉన్నారు. వీరు బిడ్ కు ఆమోద ముద్ర వేస్తేనే  ఈ విక్రయ ఒప్పందం ఖరారవుతుంది.
డిజిన్వెస్ట్ మెంట్ కమిటీ కార్యదర్శులు బిడ్ లను పరిశీలించి నిర్దేశించి ధర కన్నా టాటాలు ఎక్కువ మొత్తంలో కోట్ చేశారని మీడియాకు తెలిపారు. దీంతో ప్రసార మాధ్యమాలు ఎయిర్ ఇండియా ఇక టాటాల సొంతం అంటూ ప్రచారం చేశాయి. వెంటనే నాలిక కర్చుకున్న ఆర్థిక శాఖ ఈ విషయమై వివరణ ఇచ్చింది. ప్రక్రియ పూర్తయదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపీంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరిస్తామని అప్పటి వరకూ ఊహాగానాలు ఆపాలని కోరింది. అయితే ఈ వినతిని భారత్ లోని మీడియా పెద్దగా చెవికి ఎక్కించుకో లేదు. ఆర్థిక విషయాలను రాసే అంతర్జాతీయ పత్రికలు కొన్ని ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చాయి. ఎయిర్ ఇండియా ప్రైవేటీ కరణ ప్రక్రియ 2017 నాటి నుంచి ఉన్నదని, గతంలో ఎవ్వరూ బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు రాలేదని తెలిపాయి. నిబంధనలు సడలించిన తరువాతనే టాటాలు బిడ్ దాఖలు చేశారని అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రకటించింది. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కూడా ఎయిర్ ఇండియా టాటాలు హస్తగతం చేసుకున్నారన్న వార్తలు త్రోసిపుచ్చింది. దీనిని కూడా విదేశీ మాధ్యమాలు వెల్లడించాయి. ఈ విషయమై టాటాలను స్పందించమని కోరగా వారి నిరాకరించారని కూడా అంతర్జాతీయ మాధ్యమాలు తెలిపాయి. ఎయిర్ ఇండియాకు 1800 అంతర్జాతీయ సర్వీసులు, 4400 దేశీయ విమాన సర్వీసులు ఉన్నాయి. అప్పుల ఊబిలో కూరుకోక ముందు వరకూ ప్రపంచంలోని అతి పెద్ద విమానయాన సంస్థలలో ఎయిర్ ఇండియా ఒకటి. వేలాది మంది సిబ్బంది, వారి కుటుంబాలు ఈ సంస్థపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరి భవితను గమనించే వారెవరు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: