సామాన్య స్వరం : పేపర్ బోయ్ మనందరి ఆత్మ విశ్వాసం
ఆత్మ విశ్వాసం అనే పదం పెద్దది. విశ్వాసం లేదా వికాసం అన్నవి ఎవరికి వారు పెంపొందించుకుని చూడాలి. వార్తలో ఏముందో తెలియదు కానీ వార్తలు మోసుకు వచ్చే వారిలో మాత్రం నిబ్బరమైన విశ్వాసం ఒకటి తప్పక చూశాను. నేను చదువుకుంటాను సర్ .. బడికిపోతే ఆనందిస్తాను. బడిలో ఉంటే ఆనందిస్తాను అని చెప్పాడు నాతో ఓ పేపర్ బోయ్. ఎన్ని డిజిటల్ మాధ్యమాలు వచ్చినా కొన్నింటి విలువ ఎక్కడికీ పోదు. కొందరి విలువకు సాటి ఎవ్వరూ రారు.మనం కొన్నింటిని అతి గా చూసి అతిగా మాట్లా డడం మొదలుపెడతాం. నిరాసక్తత నుంచి పెంపొందిన ఆసక్తి, లేదా సంబంధిత గుణం, ప్రేమ జీవితాశయాలను నిర్దేశించవు కానీ కాస్తయినా ప్రభావితం చేస్తాయి. జీవితం ఒక కొన దగ్గర, మీ ఆశలు ఒక కొన దగ్గర రెండు విరుద్ధాలను కలిపి ఉంచడంలో భావ్యం లేదు. భావ్యం కాదు. రెండూ ఒక్కటే అయితే చిన్న చిన్న ఆనందాలకు మీరే కేరాఫ్.
ఎవ్వరు విజయం సాధించినా ఆనందించే లక్షణం మన నాయకులకే కాదు మనకూ ఉండాలి. మీరు బాగా పనిచేస్తున్నారు ఇంకా బాగా పనిచేయండి అని చుట్టూ ఉన్న వారు మీ నుంచి ఎప్పుడయినా కోరుకుంటే అదొక గొప్ప విన్నపం అని భావించండి. కానుక అని స్వీకరించండి. ఒక్కసారి కూడా మీరు వెనుకకు చూడకండి. మీ ప్రయాణం అన్నది మున్ముందుకే కదూ! ఆ విధంగానే మీరు కొన్ని అక్షరాలను పోగేసుకుని తీరండి. కొన్ని సామాన్య జీవితాలకు ఆలంబన ఇవ్వండి. బడుల్లేని చోట ఫ్లై ఓవర్ కింద పాఠాలు చెప్పిన యువతను చూశాను. బడిని బతికిస్తే చాలు అని అనుకున్న టీచర్లనూ చూశాను.
కేటీఆర్ కు వీరినీ చూపాలి. నాకు తెలుసు సర్! మీరు వీరిని చూసి కూడా ఆనందిస్తారని. కష్టపడే లక్షణం, తోటి వారిపై ప్రేమ, సాధించే తపన ఉన్నవారిని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గుర్తించకుండా ఎలా ఉంటారు.? మనుషుల్లో కేవలం ఒక గుణం దగ్గర ఆగిపోయి ఎవ్వరినీ మనం ప్రేమించక ఉండిపోవడం నేరం అని తోచింది. బిడ్డలను ప్రేమించే తల్లీ తండ్రికి కాస్తంత భరోసా వారంతా ప్రయోజకులు అవుతున్నారన్న ఆశ. స్వశక్తికి గొప్ప కొలమానం అంటూ ఏమీ లేదు. ఓడిపోయి చూస్తే చాలు స్వశక్తి ఏంటన్నది తెలుస్తుంది.
ఆత్మవిశ్వాసానికి అవధులు అంటూ ఏమీ ఉండవు. చేసే పనిని ప్రేమించే గుణం ఒక్కటి చాలు ఈ సమాజం మిమ్మల్ని తప్పక ఉన్నతుడిగానే చూస్తుంది. ఉదయం వేళల్లో కనబడే పేపర్ బోయ్ లు ఇలానే ఉంటారు. ఇంతకుమించి ఉంటారు. మనిషి తన జీవితంలో ఫలానాది పొందాలి అని నిర్ణయించుకుని, పోరాటం చేయక కాలాన్ని నిందించి ఏం చేస్తాడని? తల్లీ తండ్రీ మీ దారిలో కొంత దూరం వచ్చి ఉంటారు. తోడుగా ఉండి ఉంటారు.
తరువాత? ఏదో ఓ పని చేయండి మీ తల్లిదండ్రులకు భారం కాకండి. మీరు చదువుకున్న చదువు ఉన్నతమే ఉపాధికి అది తోవ ఇవ్వని రోజున తప్పక మరో మంచి పని చేసేందుకు సిద్ధం కావాలి. తల్లీ తండ్రీ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అన్న శ్రద్ధ మీలో ఉండాలి. వాటి నుంచి మీరు చేసే కొనసాగింపే మీ జీవితం. పేపర్ వేసుకునే కుర్రాళ్లంతా ఇలానే ఉంటారు. ఇంతకుమించి ఉంటారు. ఉన్నారు కూడా! కేటీఆర్ ను ఒక పేపర్ బోయ్ ఇవాళ ఆశ్చర్యపరిచాడు.
అవును! జీవితం రహదారుల వెంట జ్ఞాపకాలను ఇచ్చి ఒంటరిగా ఉండిపొమ్మంటుంది. మన సిగ్నల్ కూడళ్లు మూడు కాలాల సంధి అని అనిపిస్తాయి. మనం అంతా విశ్వాసాన్ని నమ్ముకుని ప్రయాణించాలి. సైకిల్ తొక్కుతూ బాల్యంలో పెంచుకున్న బాధ్యత ఈ బిడ్డలది. మీరు ఎక్కడో ఓ దగ్గర ఆగి చూసి వీరితో మాట్లాడితే కొన్ని క్షణాల పాటు ఏ వికాస పాఠం మీకు అవసరం ఉండదు.