వై వైవీ?: తిరుమలేశునితో ఈ చిల్లర ఆటలేంటి..?

తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆంధ్రులే కాదు.. దేశమంతా అత్యంత పవిత్రంగా భావించే పుణ్యస్థలం. ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం, దాస భక్తవారసత్వం, మైమరపించే సాహితీ సంపద కలిగిన దివ్యధామం. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే.. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన నాటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదం టీటీడీని చుట్టుముడుతూనే ఉంది. కొత్తగా ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు.. ఉన్న ప్రాశస్త్యానికి, ప్రతిష్టకూ మచ్చ రాకుండా.. పరంపర కొనసాగించినా చాలు.. అని భక్త కోటి బెంగపడే విధంగా టీటీడీ నిర్ణయాలు ఉంటున్నాయి.

కోట్లమంది మనోభావాలతో ముడిపడిన అంశమని తెలిసినా సరే.. అనేక విషయాల్లో వైవీ నేతృత్వంలోని అధికారగణం తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని అంశాల్లో లెంపలు వేసుకుంటున్నారు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అన్నట్టుగా తయారైంది వైవీ ఆధ్వర్యంలోని టీటీడీ పని తీరు. వైవీ టీటీడీ ఛైర్మన్‌గా వచ్చిన తొలి రోజుల్లోనే దేవస్థానానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న భూములను వేలం వేయాలని నిర్ణయించడం వివాదాస్పదం అయ్యింది. ఆ తర్వాత అసలు పింక్‌ డైమండ్‌ లేనే లేదని.. ఇచ్చిన వివరణ కూడా వివాదాస్పదం అయ్యింది.

తిరుమలేశుని భక్తిని విశ్వవ్యాప్తం చేసే ఎస్వీబీసీ ఛానల్‌కు పృథ్వీరాజ్‌ వంటి అధిపతిగా నియమించడం.. ఆ తర్వాత ఆయన ఓ ఉద్యోగితో మాట్లాడిన బూతుల ఆడియో బయటకు రావడం టీటీడీ పరువు తగ్గించింది. కరోనా సమయంలోనూ సర్వదర్శనం నిలిపేసి.. డబ్బుతో దర్శనం కొనుక్కునే వారికి మాత్రం దర్శన అవకాశం కల్పించడం.. డబ్బున్నవారికే తిరుమలేశుడి దర్శనం లభిస్తుందా.. అని సామాన్య భక్తుడు బాధపడేలా చేశారు.

ఇక ఇప్పుడు సంప్రదాయ భోజనం పేరిట మరో రచ్చ. అసలు తిరుమల కొండపై భోజనం అమ్మడమేంటని భక్తకోటి ప్రశ్నించడంతో.. ఈ నిర్ణయాన్ని కూడా నిలిపేశారు. తప్పు అధికారులపై నెట్టేశారు. ఇంత పెద్ద నిర్ణయం వైవీకి తెలియకుండా జరుగుతుందని భావించలేం. వైవీ సుబ్బారెడ్డికి ఇటీవలే మరో రెండేళ్లపాటు టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగే అవకాశం ఇచ్చింది. ఆ దేవదేవుని సేవించుకునే అవకాశం ఇలా ఇటీవలి కాలంలో రెండోసారి ఎవరికీ దక్కలేదు. మరి అంతటి దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. ఇలా ఎందుకు టీటీడీ ప్రతిష్ట దిగజారుస్తున్నట్టు.. వై.. వైవీ..? ఎందుకిలా..? అని ప్రశ్నిస్తున్నారు వేంకటేశ్వరుని భక్తకోటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD

సంబంధిత వార్తలు: