లోకేష్ అరెస్ట్ తో టీడీపీ ఏం సాధించింది..?
పరామర్శకు వెళ్తే తప్పేంటి..?
టీడీపీ నేతలు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు. ఆనాడు వైఎస్ఆర్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయినవారి కుటుంబాలను జగన్ వెళ్లి పరామర్శించడం కరెక్ట్ అయితే, ఇప్పుడు రమ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించడం ఎందుకు తప్పవుతుందని అని లాజిక్ తీస్తున్నారు. మీరు పరామర్శకు వెళ్లడం రాజకీయం కానప్పుడు, మేము పరామర్శకు వెళ్లడం ఏ విధంగా రాజకీయం అవుతుందని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. నారా లోకేష్ గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు చేసిన రాద్ధాంతం మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వాస్తవానికి బాధిత కుటుంబానికి ముందుగానే నష్టపరిహారం ప్రకటించింది ప్రభుత్వం. వారికి చెక్కురూపంలో ఆర్థిక సాయాన్ని కూడా పంపిణీ చేసింది. అదే సమయంలో ప్రతిపక్ష నాయకులు పరామర్శకు వస్తే మాత్రం వారిని అడ్డుకోవడం కలకలం రేపింది. కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల్ని రెచ్చగొడుతున్నారని భావిస్తే, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులున్నారు. మరి అదే సమయంలో వైసీపీ నేతలు కూడా లోకేష్ ని అడ్డుకోడానికి రావడం ఎంతవరకు సమంజసం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయం చేయాలనుకోకపోతే వైసీీపీ నేతలకు అక్కడేం పని అని అడుగుతున్నారు.
మొత్తమ్మీద లోకేష్ పరామర్శ పర్యటన టీడీపీకి పరోక్షంగా కలిసొచ్చినట్టయింది. లోకేష్ పర్యటనను అడ్డుకుని అనవసరంగా ఆ విషయాన్ని పెద్దది చేశారు. రాష్ట్రవ్యాప్త చర్చకు తెరతీశారు. రమ్య హత్య వ్యవహారంలో ఎవరిది తప్పు, ఆ పాపం ఎవరిది.. అనే విషయాన్ని పక్కనపెడితే, పరామర్శలను కూడా పెద్ద సమస్యగా చిత్రీకరించి అరెస్ట్ ల వరకు వెళ్లడంలో మాత్రం అందరి తప్పూ ఉన్నట్టు తేలుతోంది.