కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

కేసీఆర్‌..రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట.. ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేయాలో.. ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలో బాగా తెలిసిన రాజకీయ దిగ్గజం. అలాంటి ఎత్తులతోనే అసాధ్యమనుకున్న తెలంగాణను సాధ్యం చేసి చూపించారు. తెలంగాణ సాధన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టారు. మూడో సారి ఎన్నికలు ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. ఎన్నికలంటే అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి. అందులో భాగంగానే ఇటీవల కేసీఆర్ అనేక ఎత్తులు వేస్తున్నారు.

అయితే ఈ ఎన్నికల వ్యూహాల్లో నిరుద్యోగులు కూడా ఓ సరుకుగా మారిపోవడమే విషాదంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం నడిచించే నీళ్లు,నిధులు, నియామకాలు అనే మూడు లక్ష్యాల సాధన ఆధారంగా. అందులో నీళ్లపై కేసీఆర్ పై చేయి సాధిస్తున్నారు. నిధులు ఎలాగూ విభజన తర్వాత సాధించారు. కానీ.. నియామకాలు.. ఈ విషయంలో కేసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న వాదనలు ఉన్నాయి.

ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యోగాల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. కానీ.. తాజాగా ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొత్తగా జిల్లాల పునర్విభజన ద్వారా నోటిఫికేషన్ల జారీకి గండం ఏర్పడింది. చివరకు రాష్ట్రపతి ఆమోదంతో కొత్త జోన్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ విషయంలో అంత చురుకుగా ప్రక్రియ సాగడంలేదు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 50 వేల ఉద్యోగాలు అర్జంటుగా పూర్తి చేయండి అంటూ అధికారులకు ఆదేశాలిచ్చాం.. అంటూ హడావిడి చేశారు. కానీ.. ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదు. కొత్త జోన్ల ప్రకారం ఉద్యోగాల వర్గీకరణ ఇప్పుడు పూర్తయింది. మరి ఇప్పుడైనా నోటిఫికేషన్లు వస్తాయా.. లేక మరింక సాగదీస్తారా అన్నది తేలాలి. తెలంగాణలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది కాబట్టి.. తీరిగ్గా నోటిఫికేషన్లు ఇచ్చి.. సరిగ్గా ఎన్నికల ముందు ప్రక్రియ పూర్తి చేస్తారేమో అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా చివరకు  నిరుద్యోగులు ఎన్నికల సరుకుగా మారిపోయారేమో అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: