జలజగడంలో జగన్ మౌనం.. ఏపీకి తీరని నష్టం..

Deekshitha Reddy
తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన జల వివాదం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది. అయితే ఈ వివాదం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో దేనికి ఎక్కువ నష్టం అంటే ఏపీకే అని చెప్పుకోవాల్సిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి బ్రేక్ పడటంతోపాటు.. ఇటు సాగుకోసం ప్రాజెక్టుల్లో నిల్వ ఉంచున్న నీరంతా వృథాగా సముద్రంపాలవుతోంది. ఈ దశలో తెలంగాణను నిలువరించేది ఎవరు..? సీఎం జగన్ ప్రధాని మోదీకి రాస్తున్న లేఖల వల్ల ఉపయోగం ఏంటి..? అసలెందుకు జగన్ సరైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలేదనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

శ్రీశైలం జలాశయం నుంచి రోజుకి 4 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో కిందకు వదిలేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 19 టీఎంసీల నీరు వృథా అయింది అంటూ.. సీఎం జగన్ తాజాగా ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రోజుకి 4 టీఎంసీల నీరు వృథా అవుతోందంటే మాటలు కాదు. జలవనరుల వృథాను తక్షణం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ దశలో జగన్ లేఖలతో కాలం గడిపితే ఏపీకే నష్టం కానీ మరోటి కాదు. అయినా సరే జగన్ మౌనాన్నే ఆశ్రయించడం విచిత్రంగా ఉంది.

ఓవైపు తెలంగాణ నేతలు మాత్రం ఏపీలో నీటిదొంగలున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు ఏపీ సీఎం జగన్ మాత్రం, హైదరాబాద్ లో మనవాళ్లున్నారు, అందుకే మౌనం వహిస్తున్నానంటారు. అసలు జల వివాదానికి హైదరాబాద్ లో సెటిలర్లు ఉండటానికి సంబంధం ఏంటి..? తక్షణం చర్చలు జరిపి వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయలేకపోతే ఇక రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఏమున్నట్టు..? గతంలో దావత్ లు జరుపుకున్నారు కానీ, ఇప్పుడు కూర్చుని మాట్లాడుకోలేరా అంటూ ఓవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా కూడా ఏపీ ప్రభుత్వం బంతిని కేంద్రం కోర్టులో వేసి చేతులు కట్టేసుకుంది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకి ఫిర్యాదు చేస్తే ఫలితం లేదు, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాస్తే ఉలుకూ పలుకూ లేదు, ప్రధాని నరేంద్రమోదీకి రాసిన మొదటి లేఖకు జవాబు లేదు, ఇప్పుడు రెండో లేఖ రాసి.. ఫలితం కోసం వేచి చూడటం దేనికి సంకేతం..? ఏపీ ప్రభుత్వం లేఖలతో కాలక్షేపం చేస్తుంటే.. అక్కడ శ్రీశైలం ఖాళీ అవుతుంది. ఆ తర్వాత, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానీరు సముద్రంపాలవుతుంది. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆలస్యమయ్యే కొద్దీ.. నీరు సముద్రంపాలు కావడం మినహా ఇంకే ఉపయోగం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: