హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రశాంత ద్వీపంలో మొదలైన చిచ్చు
పచ్చగా, ప్రశాంతంగా ఉండే లక్షద్వీప్ లో చిచ్చు మొదలైంది. ఇపుడు మొదలైన చిచ్చు బీజేపీ పుణ్యమనే చెప్పాలి. దశాబ్దాల తరబడి ప్రశాంతంగా ఉన్న దీవుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కే పటేల్ ప్రతిపాదనల రూపంలో పెట్టిన చిచ్చు కారణంగా ఇపుడు ద్వీపమంతా అట్టుడికిపోతోంది. కేరళకు అత్యంత సమీపంలో ఉండే ద్వీపంలో జనాభా సుమారు 90 వేలు. జనాభాలో 97 శాతం ముస్లింలే. ఉండటానికి లక్షద్వీప్ 36 దీవుల సమాహారమైనా జనాభా ఉండేది మాత్రం 10 దీవుల్లోనే. ఇది కేంద్రపాలిత ప్రాంతం కావటంతో ఈ ద్వీపానికి మిగిలిన దేశంతో పెద్దగా సంబంధం కూడా ఉండదు.
ఇలాంటి ద్వీపంలో కొత్తగా నియమ నిబంధనల పేరుతో అడ్మినిస్ట్రేటర్ చిచ్చుపెట్టారు. ఈయన ప్రతిపాదించిన కొత్త నిబంధనలను జనాభా మొత్తం వ్యతిరేకించిన కారణంగానే ఇపుడు లక్షద్వీప్ అట్టుడికిపోతోంది. ఇంతకీ అడ్మినిస్ట్రేటర్ చేసిన కంపు ఏమిటంటే జనాభా మొత్తాన్ని వ్యతిరేకించే ప్రకటన చేయటమే. ఇంతకీ అవేమిటంటే సంబంధిత శాఖ అనుమతి లేకుండా గోవులు, బర్రెలను వధించటం, మాంసాన్ని విక్రయించటం. ఇక్కడ జనాభాలో అత్యధికం ముస్లింలు కావటంతో గోవధ, గోమాంసం అమ్మటం, తినటం దశాబ్దాలుగా జరుగుతోంది. దీన్ని కొత్తగా నిషేధించారు. ఇద్దరికన్నా ఎక్కువమంది పిల్లలున్న వారు పంచాయితి ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నియమం తెచ్చారు. ఇక్కడ కుటుంబనియంత్రణ లేదు. కాబట్టి సహజంగానే ఏ కుటుంబంలో కూడా చాలామంది పిల్లలే ఉంటారు. అందుకనే దీన్ని కూడా జనాలు వ్యతిరేకిస్తున్నారు.