కేసీఆర్.. కరోనాను మాయం చేస్తున్నారా..?

అవును.. కేసీఆర్ కరోనాను మాయం చేస్తున్నారు.. నమ్మలేకపోతున్నారా.. కానీ.. ఇదే నిజం.. తెలంగాణలో కరోనా బులెటిన్ లెక్కలు చూస్తే ఇదే నిజం అని నమ్మక తప్పదు. తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. తాజాగా నిన్న అయితే మరీ 1800 మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా 20 లోపే నమోదవుతున్నాయి. ఈ లెక్కలు చూస్తే తెలంగాణలో కరోనా ఫుల్ కంట్రోల్‌ ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తెలంగాణ పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి. అటు ఏపీలో రోజూ 15 వేలకుపైగా కేసులు, వంద వరకూ మరణాలు నమోదవుతున్నాయి. ఇటు చూస్తే కర్ణాటక పరిస్థితి కూడా అంతే.. తమిళనాడులోనూ 10 వేలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. కేరళలో సైతం 15 వేల కేసులు, వంద వరకూ మరణాలు రోజూ నమోదవుతున్నాయి. అంటే దక్షిణాదిలో ఒక్క తెలంగాణలో మాత్రమే అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పాలి.
మరి అంతగా తెలంగాణలో తక్కువ కేసులు ఎందుకు నమోదవుతున్నాయి. అది తెలంగాణ సర్కారు పని తీరు కారణంగానేనా అన్న సందేహాలు రాక మానవు. అయితే.. అలా చెప్పుకునేందుకు సరైన కారణాలు కూడా ఏమీ లేవు. తెలంగాణతో పాటు అన్ని దక్షిణాది రాష్ట్రాలు లాక్ డౌన్ పాటిస్తూనే ఉన్నాయి. మరి కేవలం ఎందుకు తెలంగాణలోనే తక్కువ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అంటే తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చిందా..? అంటే కాదంటున్నారు విశ్లేషకులు.  
మరి తెలంగాణలో కేసులు తక్కువగా రావడానికి అసలు కారణం టెస్టులు తక్కువగా చేయించడం కావచ్చని చెబుతున్నారు. తక్కువ టెస్టుల కారణంగా తక్కువ కేసులు నమోదవుతున్నాయన్న వాదన ఉంది. అలాగే కరోనా చనిపోయిన వారిని ఇతర జబ్బుల కారణంగా చనిపోయినట్టు నమోదు చేయడం వల్ల మరణాల సంఖ్య కూడా తక్కువగా కనిపిస్తోందంటున్నారు. అంటే మరి కేసీఆర్ కరోనాను కేసీఆర్ మాయం చేస్తున్నారా.. ఏమో లోగుట్టు పెరుమాళ్లకెరుక..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: