కేసీఆర్.. ఇంతగా అవమానిస్తావా.. రగిలిపోతున్న జర్నలిస్టులు..?

తెలంగాణలోని జర్నలిస్టులందరికీ కరోనా టీకాలు ఇవ్వాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. 18 ఏళ్లు దాటిన జర్నలిస్టులందరికీ ఈనెల 28 నుంచి టీకాలు ఇవ్వబోతున్నారు. ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న జర్నలిస్టులు కేసీఆర్ సర్కారు తీరుపై మండిపడుతున్నారు. ఇంతగా అవమానిస్తారా అంటూ రగిలిపోతున్నారు. అరె.. ఇది మంచి నిర్ణయమేగా.. మరి దీనికి ఎందుకు జర్నలిస్టులు రగిలిపోవడం అంటారా.. దానికీ కారణం ఉంది.
ఎల్లుండి నుంచి తెలంగాణలో జర్నలిస్టులకు టీకాలు ఇవ్వాలని నిర్ణయించడం బాగానే ఉంది. కానీ.. అది ఏ కోటా కిందో తెలుసా.. ఆ విషయమే జర్నలిస్టుల ఆగ్రహానికి కారణం అవుతోంది. ఎల్లుండి నుంచి తెలంగాణ సర్కారు కరోనా సూపర్ స్ప్రెడర్స్ కు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఆ కోటాలోనే ఇప్పుడు జర్నలిస్టులకు టీకాలు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 7.75 లక్షల మంది సూపర్ స్ప్రెడర్ లను ప్రభుత్వం గుర్తించింది. అందులో రైతు బజార్ వ్యాపారులు, కూరగాయల దుకాణ నిర్వహకులు, పండ్లు, కూరగాయల  వ్యాపారులు, పని చేసే సిబ్బంది, మద్యం దుకాణాల్లో పని చేసే వారు, మాంసం దుకాణాల్లో పని చేసే వారు, వీధి వ్యాపారులు, క్షౌరశాలలో  నిర్వహకులు, సిబ్బంది.. ఇలా చాలావర్గాల వారు ఉన్నారు.
క్యాబ్ డ్రైవర్ లు, వ్యాపారులు, పౌర సరఫరాల విభాగం ఉద్యోగులు, జఫర్టిలిజర్, పెస్టిసైడ్ దుకాణ నిర్వాహకులు.. ఇలా వీరిందరినీ సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించారు. వీరితో పాటే జర్నలిస్ట్ 20,000 మందిని సూపర్ స్ప్రెడర్ల జాబితాలో చేర్చి టీకాలు ఇవ్వబోతున్నారు. ఇదే జర్నలిస్టుల ఆగ్రహానికి కారణం అవుతోంది. చాలా రాష్ట్రాలు జర్నలిస్టులను కరోనా వారియర్లుగా గుర్తించాయి. వారికి వైద్య సిబ్బందితో పాటే మొదటి దశలోనే టీకాలు ఇచ్చాయి కూడా.
కానీ కేసీఆర్ మాత్రం జర్నలిస్టులను కరోనా వారియర్లుగా గుర్తించకపోగా.. కరోనా వ్యాపింపజేసే వారి జాబితాలో చేర్చడాన్ని వారు అవమానంగా భావిస్తున్నారు. ఇలా భావించడం మిగిలిన వారిని అవమానిస్తున్నట్టు కాకపోయినా.. సమాజంలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా జర్నలిస్టులకు ఉన్న గౌరవాన్ని తగ్గించడమే అంటున్నారు జర్నలిస్టులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: