ఆంధ్రాలో కరోనా అప్పుడే తగ్గుతుందట ?

ఏపీలో కరోనా విశ్వ రూపం చూపిస్తోంది. రోజూ 20 వేలకుపైగా కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. రోజూ వంద మంది వరకూ కరోనాతో చనిపోతున్నారు. ఈ కేసుల జోరు తగ్గుతున్న దాఖలాలు లేవు. వారం రోజులుపైగా లాక్‌డౌన్ పెట్టినా కేసుల్లో తగ్గుదల మాత్రం కనిపించడం లేదు. మరి ఏపీలో కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుంది.. ఇంకా ఏన్నాళ్లు ఆంధ్రాలో ఈ కరోనా విధ్వసం.. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తోంది ఏపీలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ.
ఆంధ్రాలో జూలై పదిహేను నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టవచ్చని ఎస్‌ఆర్‌ఎం  యూనివర్సిటీ విశ్లేషణ బృందం చెబుతోంది. ఈ మేరకు ఈ బృందం ఓ నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను యూనివర్సిటీ ప్రో వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.నారాయణరావు  సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌కు ఈమెయిల్‌ ద్వారా పంపారట. మరి ఈ వర్శిటీ బృందం ఎలా పరిశోధన చేసింది.. ఎలా ఫలానా తేదీకి కరోనా కట్టడి సాధ్యమని చెబుతోంది.. ఏమిటి దీనికి ఆధారం..?
ప్రపంచవ్యాప్తంగా  కరోనా అంచనాల కోసం వాడుకలో ఉన్న ఎస్‌ఐఆర్‌ అంటే సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్‌ అండ్‌ రికవరీ మోడల్‌ సాయంతో  ఈ నివేదిక తయారు చేశారట. ర్యాండమ్‌ ఫారెస్ట్‌ మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ వారు ఈ డేటాను తయారు చేశారట. ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తాము తయారు చేసిన డేటాను ఉపయోగించి  విశ్లేషణ చేశారట.  అన్ని కోణాలను పరిశీలించే నివేదిక రూపొందించినట్టు వర్శిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ వర్శిటీ విశ్లేషణ ఆధారంగా మే 21 నాటికి ఏపీలో 10 వేల కేసులు, మే 30 నాటికి 5 వేల కేసులు, జూన్‌ 14 నాటికి 1,000 జూలై నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశముందట. జూలై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్‌ఆర్‌ఎం గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి ఈ నివేదక ఎంత వరకూ నిజం అవుతుందో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: