కేసీఆర్.. విశ్వరూపమా.. భస్మాసుర హస్తమా..?

అంతా నాష్టం.. అంతా నా ఇష్టం.. అంటూ ఓ సినిమా పాట ఉంటుంది. ఇప్పుడు అది తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ తీసుకుటున్న నిర్ణయాలు .. కేసీఆర్ పోకడలు అంతా నాష్టం అన్నట్టుగా నే ఉంటున్నాయి. ప్రత్యేకించి సొంత పార్టీ నేత ఈటల రాజేందర్‌ పై ఆయన ప్రయోగిస్తున్న అస్త్రాలు చూస్తుంటే.. అంతా నాష్టం అంటూ కేసీఆర్ పాడుతున్నట్టే అనిపిస్తోంది.
అంతా నాష్టం.. నా పత్రిక రాస్తుంది.. నా ఆఫీసర్ విచారణ చేస్తాడు.. అంతా నా ఇష్టం అన్నట్టుగా ఉంది ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి. అయితే కేసీఆర్ ను మొదటి నుంచి గమనించిన వాళ్లకు ఇదేం పెద్ద ఆశ్చర్యపరిచే అవకాశం లేదు. కేసీఆర్ తీరు అంతే.. ఆయనకు నచ్చకపోతే.. పరిస్థితి ఇలా ముగియాల్సిందే. ఇందుకు చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే.. ఈటల తరహాలో మరీ వేటాడి వెంటాడి సాగనంపిన వాళ్లు మాత్రం లేరు.  
ఒక విధంగా చెప్పాలంటే ఈటల విషయంలో సీఎం కేసీఆర్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి.. ఒక మంత్రి అవినీతిపై సాయంత్రం మీడియాలో కథనాలు రావడం.. రాత్రికి విచారణ ఆదేశాలు వెళ్లిపోవడం.. మరుసటి రోజే నివేదిక రావడం.. ఆ తర్వాత రోజే శాఖలు పీకేయడం.. బర్తరఫ్ చేయడం.. ఇంత వేగంగా గతంలో ఎన్నడూ పరిణామాలు జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. ఇది కేసీఆర్ విశ్వరూపమే.  
అయితే మరికొందరు మాత్రం ఇది భస్మాసుర హస్తంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురు చెప్పే వ్యక్తే లేదు. కానీ.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా.. ప్రత్యేకించి ఈటల ను దోషిగా నిలబెట్టేందుకు కేసీఆర్ ఎంచుకున్న మార్గం సరైందేనా.. అలాంటి భూకబ్జాలు.. అవినీతి మరకలు ఉన్నవాళ్లు కేసీఆర్ మంత్రి వర్గంలోఎందరో ఉన్నప్పుడు.. ఇలా విశ్వరూపం చూపడం ముందు ముందు భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం లేకపోలేదంటున్నారు  మరికొందరు. చూడాలి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: