హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి, షర్మిల ఒకటేనా ?

Vijaya
రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి, షర్మిల ఒకటేనా ? అవుననే అంటున్నారు కొందరు సీనియర్ నేతలు. తెలంగాణాలో రాజకీయపార్టీ రాజన్న రాజ్యం తెస్తానని కొద్ది రోజులుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురు షర్మిల చాలా హడావుడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 9వ తేదీన పార్టీని ప్రకటించబోతున్నారనే ప్రచారం నేపద్యంలో ఖమ్మంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షర్మిల పార్టీ పెడితే ఏ మేరకు ప్రభావం ఉంటుందనే విషయంలో ఇతర రాజకీయపార్టీల్లో ఎవరి అంచనాలు వాళ్ళు చెబుతున్నారు.  ఈ నేపధ్యంలోనే  కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన గోనె ప్రకాశరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గోనె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో చిరంజీవి, షర్మిల ఒకటే అన్నారు.



అంటే చిరంజీవి పార్టీ పెట్టి చాలామందిని ముంచేసినట్లే షర్మిల రాజకీయపార్టీ కూడా ముంచేయటం ఖాయమని జోస్యం చెప్పారు. చిరంజీవి పార్టీ పెట్టినపుడు చాలామంది అమాయకరంగా ప్రజారాజ్యంపార్టీలో చేరిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేయటానికి చాలామంది తమ ఆస్తులు కూడా అమ్ముకున్నారు, తాకట్టు పెట్టిన విషయాన్ని గోనె ప్రస్తావించారు. ఎన్నికలైపోయిన తర్వాత అందరినీ గాలికొదిలేసి చిరంజీవి తన దారి తాను చూసుకుని కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ పెట్టి చిరంజీవి బాగుపడితే ఆయన్ను నమ్మిన చాలామంది నిండా ముణిగిపోయారని గోనె చెప్పారు.



ఇంత కాలానికి షర్మిల పెట్టబోతున్న పార్టీ కూడా అలాగే అవుతుందేమోనని గోనె అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో చిరంజీవి ముంచేసినట్లే ఇపుడు షర్మిల పార్టీ కూడా చేస్తుందని జోస్యం చెప్పటం గమనార్హం. కొత్తపార్టీ పెట్టి జనాలను ముంచద్దని షర్మిలకు గోనె ఉచిత సలహా ఇవ్వటం ఇపుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వైఎస్సార్ కు గట్టి మద్దతుదారుల్లో గోనె కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ కు అంతటి గట్టి మద్దతుదారుడే షర్మిలకు పార్టీ పెద్దనే సలహా ఇస్తున్నారంటే దాని వెనుక లోతైన ఆలోచన ఉందనే ప్రచారం కూడా పెరుగుతోంది. మరి చివరకు షర్మిల పార్టీ ఏమి చేస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: