ఇది దేశానికే గుడ్ న్యూస్.. ఇక కరోనా పరార్..?
అదేంటంటే.. దేశంలో కొవిడ్ రికవరీ రేటు 90 శాతానికి చేరుకుందట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు, మూడు రాష్ట్రాలో తప్ప దేశవ్యాప్తంగా కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోందట. 90శాతం రికవరీ అంటే అది చాలా గొప్ప శుభవార్త కింద చెప్పుకోవచ్చు. అయితే.. దేశంలో కేరళ, పశ్చిమ బంగాల్, దిల్లీ మూడో విడత కరోనా విజృంభణ వైపు వెళ్తున్నాయని కేంద్రం చెబుతోంది. అటు కేరళ, పశ్చిమ బంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీల్లో దసరా పండుగ సీజన్‌లో కేసుల సంఖ్య పెరిగిందట.
ఇది అంత మంచి పరిణామం కాదు. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని దేశాల్లో మాత్రం మళ్లీ కరోనా విజృంభిస్తోంది. పలు దేశాల్లో వైరస్ తీవ్రత పెరుగుతోంది. అందులోనూ.. ఆర్థికంగా ఉన్నతంగా ఉండి తలసరి ఆదాయం అధికంగా ఉన్న దేశాల్లో కరోనా విజృంభిస్తుండటం ఆలోచనలో పడేస్తోంది. ఆరోగ్యవ్యవస్థ అద్భుతంగా ఉన్న దేశాల్లో కూడా రెండోసారి వైరస్ తీవ్రత ఉంటోంది. అమెరికాలో అయితే కరోనా మూడో విడతగా కూడా విజృంభిస్తోంది.
అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. కరోనాపై నిర్లక్ష్యం, నిఘా తగ్గించడం, కంటైన్మెంట్ వ్యూహాలు పాటించకపోవడం వంటి కారణాలతో ఆయా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇది ఇండియాకు కూడా ఓ గుణపాఠం.. కరోనా తగ్గింది కదా అని మరీ రెచ్చిపోతే.. మళ్లీ ఇబ్బందిపడాల్సి ఉంటుందని మర్చిపోకూడదు సుమా. అందుకే తస్మాత్ జాగ్రత్త.. కరోనా నిబంధనలు పాటిస్తూనే మన జాగ్రత్తల్లో మనం ఉందాం.