వీర పత్నిగా.. వీర మాతగా.. వైఎస్ విజయమ్మ విజయ ప్రస్థానం
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగా ఈ తెలుగు నాట తొలి పరియమే అయినప్పటికీ.. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మాతృమూర్తిగా రికార్డు స్థాయిలో పల్లెపల్లెకు పరిచమైన పేరు, ప్రతి ఒక్కరి నాల్కలపై నర్తించిన పేరు వైఎస్ విజయమ్మ. నిజానికి వైఎస్ జీవించి ఉన్న రోజుల్లో గడప లోపలి వరకే పరిమితమైన విజయమ్మ.. వీరపత్నిగా తన బాధ్యతలను నూటికి రెండు వందల శాతం నెరవేర్చారు. వైఎస్ రాజకీయాల్లో బిజీగా మారిపోవడంతో ఆయన కేవలం గడప బయట వ్యవహారాలు మాత్రమే చూసుకున్నారు. మరి పెద్ద కుటుంబం అయిన వైఎస్ అన్నదమ్ముల పిల్లలు సహా వదినలు, మరదులు, మరదళ్లు.. ఇద్దరు పిల్లలు జగన్, షర్మిలను సాకడం వరకు అన్నీతానే అయి ముందుకు సాగారు.
ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా.. వైఎస్ పేరుకు ఎక్కడా భంగం కలగకుండా కుటుంబ రధాన్ని ముందుకు నడిపించి వీరపత్నిగా తనను తాను నిరూపించుకున్నారు వైఎస్ విజయమ్మ. ఇక, వైఎస్ హఠాన్మరణంతో ఒంటరి అయిన కుటుంబం ఒకపక్క, రాజకీయంగా అప్పటి వరకు అన్నీ అయి నడిపించిన కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబాన్ని ఒంటరి చేసేయడం మరోపక్క. దీంతో అప్పటి వరకు గడప వరకే పరిమితమైన విజయమ్మ.. తర్వాత కాలంలో తన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయ పార్టీ స్థాపనలోను ప్రచార రథం ఎక్కి.. తనదైన శైలిలో ప్రజలకు పార్టీని పరిచయం చేయడంలోను విజయమ్మ రికార్డు స్థాయిలో కష్టించారు.
అసలు అప్పటి వరకు రాజకీయాలే పరిచయం లేని ఓ గృహిణి.. అందరికీ వదినమ్మగానే పరిచయమైన వైఎస్ సతీమణి.. రాజకీయ క్షేత్రంలో అడుగు పెట్టి.. తనకు సాటి.. పోటీ లేరని నిరూపించుకున్నారు. ఎక్కడా బేల మాటలు లేవు.. గంభీరమైన ఉపన్యాసాలే తప్ప. ఎక్కడా సాగిలపడడాలు లేవు.. సాధించిన తన భర్త విజయాలను వివరించడం తప్ప.. తన కుమారుడికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరడం తప్ప.. అనూహ్యం.. అనుపమానం.. విజయమ్మ పొలిటికల్ అరంగేట్రాన్ని పెదవి విరిచిన వారు సైతం విస్మయం చెందాల్సిన పరిస్థితి! జగన్ స్తాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి అహరహం శ్రమించి అధికారంలోకి వచ్చే వరకు కూడా నిద్రపోకుండా శ్రమించిన విజయమ్మ.. నిజంగానే వీరపత్నిగా, వీర మాతగా తన జీవితాన్ని తానే రికార్డుస్థాయిలో తీర్చిదిద్దుకోవడం గమనార్హం. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. మరిన్ని సంవత్సరాలు ఆమె జీవించాలని కోరుకుందాం!!