శభాష్‌ తెలంగాణ.. 46లో 13 సాధించింది..?

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అనేక రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ప్రగతి పథంలో కొన్ని విషయాల్లో దూసుకుపోతోంది. ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి, పట్టణ పరిపాలన వంటి అంశాల్లో దేశంలోనే అగ్ర స్థానంలో నిలుస్తోంది. తాజాగా గ్రామ పంచాయతీల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్ఫూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధి కోసం కృషి కొనసాగుతోంది.

పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృధ్ధి విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు అందుకోబోతోంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13  అవార్డులను తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకోవడం అందరికీ గర్వకారణం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో తొమ్మిది విభాగాలకు గాను ఎనిమిది విభాగాల్లో తెలంగాణ రాష్ట్రమే అవార్డులను సాధించడం విశేషం.

దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల గ్రామపంచాయతీలు అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. అందులో 13 అవార్డులు తెలంగాణకే వచ్చాయి. ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకుంది. 13 ర్యాంకుల్లోనూ నాలుగు ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్ప విషయమే. ఈ ఘనత సాధించిన  పంచాయతీరాజ్, శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.

పల్లె ప్రగతి  సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  గ్రామీణాభివృద్ధి  కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే తరహా కృషి కొనసాగిస్తే.. తెలంగాణ పల్లెలు కల్పతరువులుగా మారతాయి. పల్లెల సౌభాగ్యమే రాష్ట్ర సౌభాగ్యం కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: