"తెలుగు" వాళ్లకు గుండెలు పిండేసే భవిష్యత్ చిత్రం?

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యార్థులు మెరుగు పడ్డారటా.. కానీ తెలుగు అ, ఆలు కూడా రాయడం లేదు. కనీసం మాట్లాడానికి ఇబ్బంది పడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రపంచ భాషల్లో ఎక్కడ లేని పదం మన ఆంధ్రులు వాడతారు. అదే ఆత్మగౌరవం దానికి సరైన అర్థం మాత్రం ఎవరూ చెప్పలేరు. అన్ని వదులుకోవడమే ఆత్మగౌరవమా.. తెలంగాణ విడిపోయిన రోజున వదిలేసుకున్నాం. హైదరాబాద్ కు సంబంధించి వదిలేసుకున్నాం. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నా వాటిని వదిలేసుకోని ఆత్మగౌరవం అని మాట్లాడుకుంటున్నాం.

ఇప్పటికి కూడా పరిశ్రమలు, వ్యాపారాలు అన్ని కూడా హైదరాబాద్ లో పెట్టుకుని ఇక్కడ కూర్చుని ఆంధ్రులం ఆత్మగౌరవం అంటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. పోనీ ఇది జరిగింది జరిగిపోయింది. కానీ తెలుగు భాష విషయంలో తెగులుగా భావించడంలో మనకు పట్టిన దరిద్రమే అని చెప్పుకోవాలి. తమిళనాడులో తమిళ్ లో వాదనలు ఉంటాయి. అక్కడ అందరూ తమిళ్ లోనే మాట్లాడుకుంటారు. ఉత్తరాదిలో మొత్తం ప్రజలు హిందీ లోనే మాట్లాడుకుంటారు. గుజరాతీలు గుజరాతీ భాషలోనే మాట్లాడుకుంటారు. కానీ మనకు మాత్రం తెలుగు మాట్లాడాలంటే నామోషీ, ఎందుకంటే ఎవరూ ఎక్కడ తెలుగులో మాట్లాడితే చిన్న చూపు చూస్తారేమోనని భయం.

మరి అలాంటపుడు తెలుగు భాష ఉంటుందా. భవిష్యత్తులో కనుమరుగవుతుందా. అమ్మ అనే అపూరమైన పదం మాయమవుతుందా. తెలుగు భాషను ప్రేమించకపోతే, రేపటి తరంలో కాలికి దెబ్బతగిలితే అమ్మ అనే పదం బదులు మమ్మీ అనే దరిద్రపు గొట్టు పదాన్నిమన పిల్లలు ఉచ్చరించాల్సిన పరిస్థితి. ఇంగ్లీషు నేర్చుకోవడంలో తప్పు లేదు. దాన్ని మాట్లాడటంలో కూడా తప్పు లేదు. కానీ తెలుగు మాట్లాడానికి భాష వచ్చినా వారు సైతం మాట్లాడుకోకుండా ఉంటున్నారు. పదాలు మరిచిపోతున్నారు. ఇద్దరు తెలుగు వారు విదేశాల్లో కలిస్తే ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో తెలుగు భాష పూర్తిగా రేపటి తరానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు రక్షించే ప్రయత్నం ప్రతి ఇంటిలో జరగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: