హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రోళ్లకు షర్మిల కీడు చేస్తోందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు దాటిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక అపోహలు ఉన్నాయి. తెలంగాణ వస్తే.. ఆంధ్రోళ్లను వెళ్లగొడతారని.. ఆంధ్రోళ్లపై దాడులు జరుగుతాయని అనుకునేవారు. హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఆస్తులకు రక్షణ ఉండదన్న వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి.అందుకే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్‌లు కూడా అప్పట్లో వచ్చాయి. కానీ.. సోనియా సర్కారు హైదరాబాద్‌ను పూర్తిగా తెంలగాణలోనే భాగం చేసింది.

కానీ.. తెలంగాణ వచ్చాక పెద్దగా ఎప్పుడూ ఆంధ్రోళ్లకు ఇబ్బందులు కలగలేదు. అంతే కాదు.. కొందరు ఆంధ్రా ప్రాంత నేతలు, పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు కూడా పెద్ద పీట వేస్తున్నారు. కానీ.. ఇన్నాళ్లకు మళ్లీ హైదరాబాద్‌లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నేత షర్మిల వల్ల ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చింది. తాను ఆంధ్రా అమ్మాయిననే తనపై వివక్ష చూపుతున్నారని ఆమె వాదిస్తోంది. కేటీఆర్ భార్య ఏ ప్రాంతమని నిలదీస్తోంది. అయితే.. షర్మిల వాదనను అనేక మంది తప్పుబడుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి షర్మిలపై విరుచుకు పడ్డారు.  రాష్ట్రం విడిపోయిన తరవాత కూడా ఎందుకీ పంచాయతీ అంటున్న జగ్గారెడ్డి..  హైద్రాబాద్ లో ఉన్న ఆంధ్రోళ్లు అంతా హ్యాపీ గా ఉన్నారని.. షర్మిల లూజ్ టాక్ చేసిందని.. ఆమెను అంత ఈజీ గా వదలబోమని అన్నారు. షర్మిలను ఎట్లా కడుగుతానో చూడండంటున్న జగ్గారెడ్డి.. ఏపీలో సమస్యలు లేవా అక్కడ మీ అన్నే కదా సీఎం అంటూ ప్రశ్నించారు. ప్రజల గురించి ఆమె ఒక్కతే మాట్లాడితున్నట్టు బిల్డప్ ఇస్తుందని... ఆమె వెంట పది మంది లేరు.. ఏం చేస్తావని ప్రశ్నించారు.

షర్మిల రాయలసీమ వారసురాలే అన్న జగ్గారెడ్డి.. ఆమె తెలంగాణకు కోడలని.. బ్రదర్ అనిల్ నుండి..షర్మిల సొంత వ్యవహారాలు మాట్లాడతానని.. షర్మిల ఎవరు వదిలిన బాణం అనే చర్చ అయిపోయిందని అన్నారు. షర్మిల వల్ల రాజకీయ యుద్ధం తెచ్చిందని.. ఆమె సెటిలర్ల ను డిస్టర్బ్ చేసినట్టేనని.. షర్మిల కామెంట్స్ తో ఇక్కడి ఆంద్ర వాళ్ళ ను ఇబ్బంది పెట్టే పరిస్థితి తెస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: