పిల్లల కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కావాలి!

బాలోత్సవ్.. 30 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా కొత్త గూడెంలో మొదలైన ఈ ఉత్సవం ఇప్పుడు బాలలకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. బాలోత్సవ్-2022 కార్యక్రమానికి గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాల వేదికైంది. వేలాదిమంది విద్యార్థుల ఆటపాటలు, కేరింతలతో కళాశాల సందడిగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం మార్మోగింది. పిల్లల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేలా 1991లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వాసిరెడ్డి రమేశ్ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం ఏపీ విభజన తర్వాత గుంటూరు శివారు వీవీఐటీ కళాశాలలో ఈ పోటీలు ఏటా జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనా వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు బాలోత్సవ్ 2022 పోటీలను నవరత్నాల పథకాల ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి, ఎపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ అజయ్ రెడ్డి ప్రారంభించారు. బాలోత్సవ్ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి రమేష్, వీవీఐటీ ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. మొత్తం 20 అంశాల్లో 59 విభాగాల్లో విద్యార్థులు పోటీపడ్డారు.

 రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 13వేల మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారితోపాటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వచ్చారు. దీంతో బాలోత్సవ్ 2022 కార్యక్రమానికి వేదికైన వీవీఐటీ ప్రాంగణం కిటకిటలాడింది. మార్కుల ఒత్తిడితో సతమతమవుతున్న విద్యార్థులు సేదతీరేందుకు ఇదో మంచి అవకాశమని కార్యక్రమానికి హాజరైన అధికారులు అభిప్రాయపడ్డారు.
ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీపట్టే పిల్లలు.... ఒక్కసారిగా స్వేచ్ఛగా తమకు నచ్చినరంగాల్లో ప్రతిభను చూపేందుకు పోటీపడ్డారు.

వేలాదిమంది విద్యార్థులతోపాటే.... తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ పోటీల కోసం వచ్చారు. ఇలాంటి పోటీల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, కలివిడితనం మెరుగవుతుందని చెబుతున్నారు. ఇలాంటి బాలోత్సవాలు మరిన్ని జరగాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నెల 14 వరకు మూడు రోజులపాటు ఈ పోటీలు జరగుతాయి. భోజన, రవాణా, వసతిపరంగా నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లల కోసం ఇలాంటి కార్యక్రమాలు తరచూ జరగాలి.. బాల వికాసం జరగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: