ఆంధ్రప్రదేశా.. అదానీ ప్రదేశా?

రాష్ట్రంలో అదానీ సంస్థ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే.. ప్రజలు, ప్రభుత్వ ధనాన్ని అదానీకి దోచిపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ రాష్ట్రంగా మార్చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అదానీని పెంచి పోషించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చింతా మోహన్‌ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అబద్ధాల ప్రదేశ్‌గా మారిందని... ఇతర రాష్ట్రాల కంటే అధ్వాన్నస్థితికి చేరిందని చింతా మోహన్‌ విమర్శించారు.

సీఎం జగన్‌ను అంతా ప్రధాని దత్తపుత్రుడిగా అనుకుంటున్నారని... అమరావతి పనులు మొదలు పెట్టాలని ప్రధాని తన దత్తపుత్రుడిని ఎందుకు ఆదేశించరని చింతా మోహన్‌ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అమరావతి మొండి గోడలుగా మిగిలిందని చింతా మోహన్ ఆవేదన చెందారు. పోలవరం నిర్మాణం ముందుకు సాగడం లేదని... తాము ఇస్తామన్న ప్రత్యేక రాష్ట్ర హోదా ఏమైపోయిందో? తెలియడం లేదని... అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైందని చింతా మోహన్ ధ్వజమెత్తారు.

పేదలు రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని... ఆకలితో నిరుపేదలు నిద్రపోవడం లేదన్న చింతా మోహన్ దేశ వ్యాప్తంగా 60 కోట్ల మంది ఆకలితో అలమిస్తుంటే-ఆంధ్రప్రదేశ్‌లోనే కోటి మంది ఉన్నారన్నారు. విజయవాడలో రెండు లక్షల మంది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారన్న చింతా మోహన్..  వారికి కనీసం ఒక్క పూట భోజనం కూడా అందని పరిస్థితి ఉందని.. ఇదేనా జగన్‌ చెప్పే రాజన్న రాజ్యం? అని ప్రశ్నించారు.

విద్యార్ధులకు ఉపకారవేతనాలు, హాస్టల్‌ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదన్న చింతా మోహన్.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బు దోచుకుంటూ తమ ఆకలి తీర్చుకుంటున్నారని ఆవేదన చెందారు. శాసనసభ వేదికగా పాలకులు అబద్ధాలు చెబుతున్నారని... రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు చేసింది ఏమీ లేదన్నారు. ప్రధానికి జగన్‌ దత్తపుత్రుడని...ఆయన చెప్పింది సీఎం చేస్తారన్నారు. చదువులు చెప్పే గురువులను బంట్రోతులుగా మార్చిన ఘనుడు జగన్‌ అని... ఒక్క ఉపాధ్యాయుడు కూడా సంతృప్తి పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చింతా మోహన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: