అసెంబ్లీలో సీఎం జగన్‌ది ఏకపాత్రాభినయమా?

ఏపీ సీఎం జగన్.. ప్రతిరోజూ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. విపక్షాల విమర్శలకు సమాధానాలు ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం వంటి కీలక అంశాలపై ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అయితే ఇదంతా జగన్ ఏకపాత్రాభినయమే అంటున్నారు అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ప్రతిపక్షాన్ని గెంటివేసి అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించేందుకు సిఎం జగన్‌ ఏకపాత్రాభినయం చేస్తున్నారని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి మాటలు పిట్టలదొరను పోలినట్టే ఉన్నాయని తనతో కొంత మంది అన్నట్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి... తానే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా జగన్‌ చెప్పడం విస్మయాన్ని కలిగించిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రతిపక్షనేతగా చేసిన పాదయాత్రలో... తాత్కాలిక, పొరుగు సేవల సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఒక్కరిని కూడా క్రమబద్ధీకరించిన పాపాన పోలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

చంద్రబాబు హయాంలో పరిశ్రమలు రాలేదని, రోడ్డున తిరిగే వారికి సూటు, బూటు వేయించి పారిశ్రామికవేత్తలని చెప్పి సంతకాలను చేయించారంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన కంపెనీలను.. ఈ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించినట్లుగా చెప్పుకోవడం భావ దారిద్రమే అవుతుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.  స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటును కోరుతూ టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం అర్థరహితమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల ఆరు నెలల అవుతున్నా.. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రతిపక్షనేతగా రాజధాని నిర్మాణం గురించి అద్భుతంగా ప్రసంగించిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక చేసిందేమిటని రఘురామ ప్రశ్నించారు. మొత్తం మీద జగన్‌ మళ్లీ సీఎం కాలేడని రఘురామ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: