టాలీవుడ్ లో గ్లామర్ వెనుక ఉన్న గంభీర నిజం – నిర్మాతల పోరాటం!

Amruth kumar
తెలుగు సినిమా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్. ₹500 కోట్లు, ₹1000 కోట్ల కలెక్షన్ల గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ గ్లామర్ వెనుక టాలీవుడ్‌ నిర్మాతలు ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నిర్మాత మాత్రం నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల తాజా ఆవేదన. ముఖ్యంగా హీరోల రెమ్యూనరేషన్లు ఆకాశాన్ని తాకడం, OTT సంస్థలు చేతులెత్తేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద క్రైసిస్‌గా మారింది.



ఒకప్పుడు సినిమా మొదలవ్వక ముందే నిర్మాతలకు ఓ ధీమా ఉండేది. థియేటర్లో పోయినా OTT రైట్స్ రూపంలో పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు ఇప్పుడు తమ బడ్జెట్‌ను భారీగా తగ్గించేశాయి. కేవలం స్టార్ హీరోల సినిమాలకు తప్ప, మిగిలిన చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా, "ముందు సినిమా థియేటర్లో రిలీజ్ చేయండి.. టాక్ చూశాక రేటు మాట్లాడుకుందాం" అని OTT సంస్థలు కండిషన్లు పెడుతుండటంతో నిర్మాతలకు గుండె గుభేల్ మంటోంది.



సినిమా బడ్జెట్‌లో 60 నుంచి 70 శాతం కేవలం హీరోలు, దర్శకుల పారితోషికాలకే సరిపోతోంది. ఓ టాప్ హీరో సినిమా బడ్జెట్ ₹200 కోట్లు అయితే, అందులో హీరోకే ₹100 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రొడక్షన్ క్వాలిటీ మీద దెబ్బ పడటంతో పాటు, సినిమా రిస్క్ మొత్తం నిర్మాత మీద పడుతోంది. సినిమా సూపర్ హిట్ అయితే హీరో తన రేటు పెంచుకుంటాడు, ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాత ఆ నష్టాన్ని భరించాల్సి వస్తోంది. "సినిమా గెలిస్తే అందరిదీ.. ఓడితే మాత్రం నిర్మాతదే" అన్నట్టుగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి.గతంలో ₹20 కోట్లలో పూర్తయ్యే సినిమాలు ఇప్పుడు ₹50 కోట్లు దాటుతున్నాయి. కారవాన్ ఖర్చులు, పర్సనల్ స్టాఫ్ మెయింటెనెన్స్, లగ్జరీ హోటల్స్.. ఇలా ప్రతిదీ నిర్మాతకు భారం అవుతోంది. చిన్న సినిమాలకు థియేటర్ల అద్దెలు భరించడం కూడా కష్టంగా మారింది. సంక్రాంతి వంటి పెద్ద సీజన్లలో థియేటర్లు దొరకక, దొరికినా వాటి రేట్లు చూసి నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు.



ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న ప్రకారం.. హీరోలు తమ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకుని, లాభాల్లో వాటా తీసుకుంటేనే నిర్మాతలు బ్రతుకుతారు. అలాగే OTT సంస్థలతో లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోవడం కాకుండా, కంటెంట్‌ను నమ్ముకుని తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ సినిమాలు తీయాలని విశ్లేషకులు చెబుతున్నారు.సినిమా రంగం అంటేనే ఒక గ్యాంబ్లింగ్. కానీ ఇప్పుడు అది నిర్మాతలకు ఊపిరాడనివ్వని ఉచ్చులా మారుతోంది. ఈ సంక్షోభం నుంచి టాలీవుడ్‌ బయటపడాలంటే స్టార్ల నుంచి సపోర్టింగ్ స్టాఫ్ వరకు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే బాక్సాఫీస్ వద్ద ఎన్ని వందల కోట్లు వచ్చినా, నిర్మాత ఇంటికి మాత్రం 'సున్నా'నే మిగులుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: