బీసీలకు లక్ష కోట్లు.. వైసీపీ కొత్త డిమాండ్‌?

వైసీపీ జాతీయ స్థాయిలో మరో అంశంపై చర్చకు తెర లేపింది. దేశంలో అన్ని రంగాల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందంటున్న వైసీపీ.. ప్రత్యేకమైన చేయూత కావాలని డిమాండ్ చేస్తోంది. బీసీలకు కేంద్రం తగిన న్యాయం చేయడం లేదని... బీసీలకు కనీసం లక్ష కోట్ల బడ్జెట్‌ పెట్టాలని వైసీపీ జాతీయ స్థాయిలో డిమాండ్  చేస్తూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. కేంద్ర బడ్జెట్‌ రూ.38.45 లక్షల కోట్లు ఉంటే.. అందులో బీసీలకు కేవలం రూ.1400 కోట్లు మాత్రమే కేటాయించారని వైసీపీ ఎంపీలు గుర్తు చేస్తున్నారు.

బీసీలకు  కనీసం లక్ష కోట్లు ఇవ్వాలంటున్న వైసీపీ ఎంపీలు... రాష్ట్రాల్లో అమలు చేసే పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోనే కాక..  ప్రైవేటు రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని... సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ల అమలు చేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే ప్రధానిని కలిసి ఈ అంశంపై విజ్ఞప్తి చేయబోతున్నామని బీసీ ఎంపీలు తెలిపారు.

సామాజిక న్యాయం విషయంలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి దేశానికే రోల్‌ మోడ‌ల్‌గా నిలిచార‌ని వైసీపీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌ అంటున్నారు. మంత్రి పదవులు మొదలుకుని, అన్ని నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు అగ్రస్థానం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ ప‌నుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చార‌న్నాని.. జ‌గ‌న్ కేబినెట్‌లో ఏకంగా 10 మంది బీసీలు ఉన్నారని వైసీపీ ఎంపీలు గుర్తు చేశారు.

బీసీల పార్టీ అని చెప్పుకున్న నేతలు కూడా ఇంత‌గా సామాజిక న్యాయం పాటించ‌లేద‌ని బీసీ ఎంపీలు ఎద్దేవా చేశారు. రాజ్యసభ టికెట్లు కూడా జగన్ బీసీలకు ఎక్కువగా ఇచ్చారని.. మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులుంటే, అందులో నలుగురు బీసీలు ఉన్నారని గుర్తు చేశారు.  ఇది దేశంలో ఎవరూ చేయలేదని వైసీపీ ఎంపీలు అంటున్నారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక  మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ంటున్నారు వైసీపీ ఎంపీలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: