ఏపీ, తెలంగాణ.. వాటాలు తేల్చేస్తారట..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలు విడిపోయి దాదాపు 8 ఏళ్లు దాటిపోతున్నా.. ఇంకా అనేక విభజన సమస్యలు రెండు రాష్ట్రాలను వెంటాడుతూనే ఉన్నాయి. వాటిలో నదీ జలాల సమస్య ప్రధానమైంది. ఇంకా కృష్ణా, గోదావరి జలాల్లో ఎవరి వాటా ఎంత అనేది తేలలేదు.. అయితే..
కృష్ణా నది మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుపరిశీలనలో ఉందంటోంది కేంద్రం.. ఈ మేరకు  కేంద్ర జలశక్తి స‌హాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంటులో వివరించారు.

రాజ్యసభలో వైసీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే.. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్ట్‌లలో 75 శాతం నికర జలాలకు మించి ప్రవహించే మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారట. అందుకు నిర్ధిష్టమైన విధానం రూపకల్పన చేసే బాధ్యతను కేఆర్ఎంబీ రివర్ మేనేజ్‌మెంట్‌ కమిటీ తీసుకుందట. వర్షాకాలంలో కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్ట్‌ల నుంచి విడుదలయ్యే మిగులు జలాల పంపకంపై ఈ కేఆర్‌ఎంబీ దృష్టి సారిస్తుంది.

ఈ జలాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు కేంద్ర జల సంఘానికి  చెందిన సాంకేతిక సంఘాన్ని కూడా తమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి స‌హాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు చెబుతున్నారు.  అయితే ఇక్కడో చిక్కు కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు దీనికి సంబంధించిన అవసరమైన సమాచారం సమర్పించట్లేదట. అందువల్ల ఈ సాంకేతిక సంఘం తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయలేకపోయిందట.

ఒక ఏడాది సంవత్సరంలో కృష్ణానదిలో లభించే మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్‌ ట్రైబ్యునల్‌ ఏపీకి ఇచ్చింది. అయితే..  మిగులు జలాల వినియోగం తప్ప వాటిపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఉండబోదు. ఏపీ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్ట్‌ల వారీగా కేటాయింపులు చేసేందుకు కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ కాల పరిమితిని కూడా పొడిగించామని కేంద్రమంత్రి చెబుతున్నారు. మరి ఈ పంచాయతీ ఎప్పుడు తెగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: