అమరావతిలో తెలంగాణ బృందం పర్యటన.. ఎందుకంటే?

అవును.. నిజమే.. అమరావతిలో తెలంగాణ మంత్రి పర్యటించారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తన బృందంతో అమరావతిలో పర్యటించారు. ఆయనతో పాటు ఈ పర్యటనలో ఇంకా ఎవరు ఉన్నారంటే.. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు కూడా ఈ బృందంలో ఉన్నారు. ఇంతకీ వీరంతా అమరావతిలో ఎందుకు పర్యటించారని ఆశ్చర్యపోతున్నారా.. అందుకు సరైన కారణమే ఉంది.

తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఓ ఆలయం నిర్మించబోతోంది. శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని కరీంనగర్‌లో నిర్మించాలని భావిస్తున్నారు. అందుకు అమరావతి వెళ్లడం ఎందుకు అంటారా.. ఎందుకంటే.. అమరావతిలోనూ టీటీడీ ఇప్పటికే ఓ ఆలయం నిర్మిస్తోంది. ఈ నమూనాను పరిశీలించేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు అమరావతిలోని ఆలయాన్ని సందర్శించారు. అమరావతిలోని టీటీడీ ఆలయ స్థపతులను నిర్మాణ  వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అమరావతిలో నిర్మితం అవుతున్న టీటీడీ ఆలయ ప్రాంగణాన్ని తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందం  పరిశీలించింది. ఆగమ, వాస్తు శాస్త్రం, ఆలయ నిర్మాణ శైలి, గర్భాలయం, అంతరాలయం, అర్థ మండపం, మహా మండపం, ముఖమండపం, గరుడాళ్వార్ సన్నిధి, ధ్వజస్తంభం, బలిపీఠం, తూర్పు రాజ గోపురం, ఉత్తర ద్వారం, ప్రాకార మండపాలు వంటి నిర్మాణాల గురించి అడిగి తెలుసుకుంది. వాటి విశిష్టతలను  ఆలయ స్థపతులను అడిగి తెలుసుకుంది.

ఈ తెలంగాణ బృందం పర్యటన దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఆలయ ప్రాంగణం అంతా  కలియ తిరిగిన మంత్రి గంగుల సారథ్యంలోని బృందం.. ఆలయ నిర్మాణానికి శిలలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకున్నారు. ఎంత మంది శిల్పులు పాల్గొంటున్నారు, ఎన్ని రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తవుతుందనే వివరాలను ఈ బృందం ఆసక్తిగా అడిగి తెలుసుకుంది. ఆలయం స్థపతులు మునిస్వామి రెడ్డి, కృష్ణారావులతో ఈ విషయాల గురించి కూలంకషంగా చర్చించారు. ఆ తర్వాత వారిని కరీంనగర్‌ రావాలని ఆహ్వానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: