కేసీఆర్‌.. జయశంకర్‌ సొంత గ్రామాన్ని పట్టించుకోలేదా?

ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ సిద్ధాంతకర్త. ఎప్పుడో 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి.. ఆ తర్వాత చల్లబడిన తర్వాత దాన్ని గురించి ఎవరూ పట్టించుకోని సమయంలో తెలంగాణ భావాన్ని సజీవంగా నిలిపిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ప్రోఫెసర్ జయశంకర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగానే అప్పట్లో కేసీఆర్‌ తెలంగాణ వాదానికి మరోసారి జీవం పోశారు. అలాంటి ప్రొఫెసర్ జయశంకర్‌ సొంత గ్రామాన్ని కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి.

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణితో ఉందని పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా జయశంకర్  స్వగ్రామంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కానరావడం లేదంటున్నారు. ఎందరో మంది ప్రజాప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించినా..  ఊరు బాగుకోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని.. ఆ ఊరిలో పరిస్థితులు చాలా ఆధ్వాన్నంగా ఉన్నాయని.. కనీస మౌలిక సదుపాయాలకు కూడా ఆ గ్రామం నోచుకోకపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి అంటున్నారు.

ఇప్పటికీ జయశంకర్ సొంతఊరికి రెవెన్యూ విలేజ్ హోదా ఆ గ్రామానికి ఇవ్వలేదట. రాష్ట్రంలో ఇన్ని గ్రామపంచాయితీలను కొత్తగా చేశామని తండాలను పంచాయితీలుగా మార్చామని.. కేసీఆర్‌ ప్రగ్భలాలు పలుకుతుంటారు కానీ ఆచార్య జయశంకర్ పుట్టిన ఊరు అక్కంపేటను ఇంకా రెవెన్యూ విలేజ్ గా గుర్తించలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే మీ మనస్సులో ఆ పెద్దమనిషి మీద ఎంత విద్వేషం, వ్యతిరేక భావం ఉందో అర్ధమవుతుంది కదా అని విమర్శిస్తున్నారు.

ఇప్పటికీ జయశంకర్ సార్ సొంత ఊరు అక్కంపేట  పెద్దాపూర్ విలేజ్ పరిధిలోనే కొనసాగుతుండటం క్షమించరాని అంశమంటున్న రేవంత్ రెడ్డి.. ఇక్కడి నిరుపేద దళితుడు  చాలా దీనమైన పరిస్థితుల్లో  కుటుంబం జీవనం సాగిస్తున్నారన్నారు.  కనీసం సొంత ఇళ్లు సైతం లేదని.. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే దళిత జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ఆ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: